బీజేపీ మిత్రపక్షం.. అవిశ్వాసానికి మద్దతివ్వం

11 Mar, 2018 01:10 IST|Sakshi

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి యనమల వ్యాఖ్య 

సాక్షి, అమరావతి: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పారు. శనివారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, టీడీపీ కీలక నాయకుల సమా వేశం జరిగింది. అనంతరం కళా వెంకట్రావు, యనమల విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాసానికి తామెందుకు మద్దతిస్తామని ప్రశ్నించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి అభ్యంతరమైతే టీడీపీనే అవిశ్వాసం పెట్టవచ్చుగా అని విలేకరులు ప్రశ్నించగా.. తాము ఇప్పటికీ ఎన్డీయేలోనే కొనసాగుతున్నామని, బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ తామెలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రశ్నించారు. బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతూనే హోదాతో సహా విభజన హామీల కోసం పోరాడతామని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి అసలు నిధులు ఇవ్వలేదని తాము అనడం లేదని.. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతున్నామన్నారు.

ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఇంతవరకు నిధులు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకొచ్చామని.. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద ఇంకా కేవలం రూ.135 కోట్లు మాత్రమే వస్తాయని జైట్లీ చెప్పడం సమంజసం కాదని యనమల అన్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని ఒక ప్రశ్నకు యనమల బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు