కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా పనులు

4 Jul, 2018 12:25 IST|Sakshi
ఈఈ మహేశ్వరయ్యతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పీఆర్‌ ఈఈ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ధర్నా

సాయంత్రం వరకు కొనసాగిన ఆందోళన

పోలీసుల రాకతో ఉద్రిక్తత

నెల్లూరు(అర్బన్‌): పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ఇంజినీరింగ్‌ అధికారులు కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులపై ధ్వజమెత్తారు. రోడ్ల నిర్మాణంలో ఇంజినీరింగ్‌ అధికారుల అవినీతిని నిరసిస్తూ నెల్లూరులోని పాత జెడ్పీ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం వద్ద  పలువురు సర్పంచ్‌లతో పాటు ఎమ్మెల్యే కాకాణి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉపాధి నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, కన్వర్జెన్సీ నిధులు తదితరాలకు చెందిన రూ.100 కోట్లతో సీసీ రోడ్లు  నిర్మిస్తున్నారన్నారు. అయితే ఈ పనుల్లో నాణ్యత లేదన్నారు.

ముక్కుపిండి వసూలు
ఏఈకి 5 శాతం. ఈఈకి 2.5, డీఈకి 2, డీఈ కార్యాలయానికి 0.5, డ్రాయింగ్‌ అధికారికి 0.5, మేనేజర్‌కి 0.5, అకౌంట్‌ అధికారికి 0.5, కమెన్స్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చేప్పుడు ఈఈకి మరో 0.5శాతం, ఈఈ కార్యాలయానికి మరికొంత చొప్పున మొత్తం కలిపి 15 శాతం కమీషన్లను అధికారులు ముక్కుపిండి తీసుకుంటున్నారని కాకాణి విమర్శించారు. సర్పంచ్‌ల పదవీకాలం మరో నెలరోజులు మాత్రమే ఉండటంతో ప్రస్తుత కమీషన్‌కు తోడు అదనపు కమీషన్‌ కోసం అధికారులు సర్పంచ్, కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అదనపు కమీషన్లు ఇచ్చిన చోట కమన్స్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చిన తేదీల ప్రకారం కాకుండా ముందుగానే పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కమీషన్‌ ఇవ్వని చోట ముందుగా పనులు మంజూరై లెటర్‌ ఇచ్చినప్పటికీ ఆపేస్తున్నారన్నారు. సంబంధిత ఏఈ శ్యాంను వివరణ కోరగా ఈఈ మహేశ్వరయ్య పనులు ఆపమంటున్నారని చెప్పారని ఇందుకు వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. సర్వేపల్లి, పాలిచెర్లపాడు తదితర గ్రామాల్లో ముందుగానే పనులు మంజూరైనా ఎందుకు చేపట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరుగుతుంటే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. దీనిని బట్టి అధికార పార్టీ నాయకులకు కూడా ముడుపులు అందుతున్నాయని అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఇదే విషయమై కలెక్టర్‌ ముత్యాలరాజుకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

లంచం తీసుకున్నట్టు ఒప్పుకున్న ఏఈ
ఇదే సందర్భంలో ఎమ్మెల్యే ఏఈకి ఫోన్‌ చేసి కమీషన్‌ తీసుకున్నావు కదా అని గట్టిగా  ప్రశ్నించారు. తాను బలవంతంగా తీసుకోలేదని సర్పంచ్‌లు ఇస్తేనే తీసుకున్నానని ఏఈ బదులిచ్చారు. ఈ విషయాన్ని కాకాణి తన ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌చేసి మీడియాకు, ఈఈ మహేశ్వరయ్యకు వినిపించారు. లంచం తీసుకున్నట్టు రుజువైంది కదా.. ఏఈపై ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు.

కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఏఈ
అనికేపల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు అభివృద్ధి పనుల విషయమై తీర్మానంపై తాను సంతకం చేయలేదని రాతపూర్వకంగా రాసిచ్చాడన్నారు. అయితే కార్యదర్శి సంతకాన్ని ఏఈ శ్యాం ఫోర్జరీ చేసి సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాడని దీనిపై ఏసీబీ చేత విచారణ చేయించాలని కాకాణి పట్టుబట్టారు. కమెన్స్‌మెంట్‌ లెటర్‌ ప్రకారం పనులు ఎప్పుడు చేపడుతారు?, ఏఈపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని అప్పటివరకు ఆందోళన విరమించేది లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఈఈ మహేశ్వరయ్య మాట్లాడుతూ తాము ఏఈని పిలిపించి మాట్లాడి సర్వేపల్లి, పాలిచర్లపాడు గ్రామాల్లో ఆగిపోయిన పనులను చేపట్టేలా చూస్తామని తెలిపారు. దీనికి ఒప్పుకోని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగిన పనులను ఏ తేదీనుంచి మొదలుపెడతారో నిర్ధిష్టంగా హామీ ఇవ్వాలని, అలాగే ఏఈపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు తాము కదిలమని ఈఈ కార్యాలయంలోనే బైఠాయించారు.  

సాయంత్రం వరకు..
ఉదయం 10.00 నుంచి సాయంకాలం 5.00 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఈఈ ఫిర్యాదు మేరకు మ«ధ్యాహ్నం పోలీసులు రంగప్రవేశం చేసి గేట్లుమూసేసి ఎవరినీ లోనికి అనుమతించలేదు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఒకటో నగర సీఐ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఆందోళన ఏంటని అడిగారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధిగా పనుల అవినీతిపై తాను ప్రశ్నించానని, ఈఈ సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. మధ్యలో మీకు సంబంధం లేని అంశమన్నారు. దీంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారు. ఆందోళన కొనసాగుతుండటంతో ఈఈ మహేశ్వరయ్య మాట్లాడుతూ దైవసాక్షిగా తాను పనులు ఆపాలని ఏఈతో చెప్పలేదన్నారు. వచ్చే సోమవారం నుంచి ఎమ్మెల్యే చెప్పిన గ్రామాల్లో పనులు చేపడుతామని హామీఇచ్చారు. అలాగే ఫోర్జరీ సంతకం గురించి ఏఈపై విచారించి తగు చర్యలు చేపడుతామని హామీఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈఈ మాటతప్పితే నిరాహారదీక్ష చేస్తామని ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య, జెడ్పీ కో–ఆప్షన్‌ సభ్యుడు బాషా, పలువురు సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు