రాజ్యాంగం ప్రకారమే సీఎల్పీ విలీనం : రేగా కాంతారావు

12 Jun, 2019 14:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజ్యాంగ బద్ధంగానే తాము టీఆర్‌ఎస్‌లో చేరామని పార్టీ మారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె‍ల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గ్రూపిజంతో సతమతమవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీని వీడటానికి గల కారణాలను లేఖ ద్వారా స్పష్టంగా వివరించామని తెలిపారు. అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా లేఖలో పేర్కొన్నామన్నారు. రాజ్యాంగ బద్ధంగా తమకున్న హక్కుతోనే సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయమని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ విలీనం గురించి పదో షెడ్యూల్‌లో స్పష్టంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌ నేతలకు చదువురాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని రేగా మండి పడ్డారు. తమ మీద అనవసర ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కాంగ్రెస్‌ నాయకులను హెచ్చరించారు. పరిషత్‌ ఎన్నికల్లో ఉత్తమ్‌, భట్టి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవి చూసిందని ఆయన విమర్శించారు.

అమ్ముడుపోవడానికి జంతువులం కాదు : గండ్ర
ప్రలోభాలకు లొంగిపోవడానికి.. పదవులకు అమ్ముడుపోవడానికి మేం గొర్రెలు, బర్రెలం కాదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీపై తమకున్న అసంతృప్తిని చాలాసార్లు అధిష్టానానికి తెలియజేశామన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారమే టీఆర్‌ఎస్‌లో చేరామని తెలిపారు. ఎవరూ పాలన చేసినా రాజ్యాంగం ప్రకారమే చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చేరికలు జరుగుతున్నాయన్నారు. తన నిర్ణయాన్ని ప్రజలు సమర్థించారని.. అందుకే జడ్పీ ఎన్నికల్లో తన భార్య జ్యోతి 10 వేల మెజార్టీతో గెలిచిందన్నారు. రాష్ట్ర సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యమన్నారు గండ్ర.

మరిన్ని వార్తలు