‘ఆ అంశంలో ఉత్తమ్‌ తప్పు చేశారు’

26 Apr, 2018 14:11 IST|Sakshi
కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో విబేధాలు బయటపడుతున్నాయి. తెలంగాణ పీసీసీపై ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర పీసీసీ తన సానుకూల వర్గాన్ని ఒకలా.. వ్యతిరేక వర్గాన్ని మరోలా చూస్తోందని ఆయన ఆరోపించారు. నాగం జనార్థన్‌ రెడ్డి పార్టీలో చేరికపై తమతో సంప్రదిస్తామని చెప్పారు కానీ ఆతర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. నాగం అంశంలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తప్పు చేశారని, వర్గ విబేధాల వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం లేదన్నారు.

నాగర్‌ కర్నూల్‌లో బలమైన నాయకులను దెబ్బతీసేందుకే జైపాల్‌రెడ్డి, చిన్నా రెడ్డిలు ప్రయత్నిస్తున్నారన్నారు. రాహుల్‌ గాంధీకి తప్పడు సమాచారం ఇచ్చి నాగం పార్టీలో చేరాలా చేశారని ఆరోపించారు. జైపాల్‌ రెడ్డి.. రాజీవ్‌ గాంధీని ఉరితీయాలని చెప్పిన వ్యక్తి అని మండిపడ్డారు. తనపై పార్టీ వ్యవహారాల ఇంచార్జి కుంతియా చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. నాగం పార్టీ కోసం పని చేస్తే సరేకానీ టికెట్ ఇస్తే తాము ఏం చేయాలో అది చేస్తామన్నారు.

 టికెట్ ఖాయం చేసినట్టు నాగం చెప్పుకుంటున్నారని, కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పీసీసీ, కుంతియా అంటున్నారన్నారు. దీనిపై మీడియా ముందు స్పష్టం చేయాలన్నారు. 20 ఏళ్ళుగా పార్టీ కోసం , నాగంకు వ్యతిరేకంగా పోరాటం చేశామని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు నాగం వర్గమే పుకార్లు చేస్తుంది.. ఆయనకు టికెట్ ఇస్తే తాను సహకరించనని దామెదర్‌రెడ్డి తేల్చిచెప్పారు. 
 

మరిన్ని వార్తలు