మీ కోసం కొట్లాడిందెవరు?

15 Nov, 2023 03:52 IST|Sakshi

రేవంత్, ఉత్తమ్‌ ఒక్కనాడైనా ఉద్యమించారా!: బండి

హుస్నాబాద్‌: ‘మీ కోసం ఐదేళ్లు కొట్లాడిందెవరు.. లాఠీ దెబ్బలు తిన్నదెవరు, జైలుకు పోయిందెవరు.. రేవంత్, ఉత్తమ్, ఇక్కడున్న పొన్నం ప్రభాకర్‌ మీ కోసం ఒక్కనాడైనా ఉద్యమించారా’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో యుద్ధం చేసినందుకు రెండుసార్లు జైలుకు వెళ్లానని, తనపై కేసీఆర్‌ 74 కేసులు పెట్టాడని చెప్పారు. పొరపాటున బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకోక తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను సీఎం చేస్తారని, దీంతో హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావులు తలో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటకు వస్తారని, దీంతో ప్రభుత్వం పడిపోతుందన్నారు.

అలాగే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అందరూ సీఎంలేనని, చివరకు పొన్నం ప్రభాకర్‌ కూడా సీఎం అంటాడేమోనని ఎద్దేవా చేశారు. వీళ్ల కొట్లాటతో ప్రభుత్వం పడిపోయి ఉప ఎన్నికలు వస్తాయన్నారు. తెలంగాణలో సుస్ధిర ప్రభుత్వం రావాలంటే బీజేపీతోనే సాధ్యమని, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని బండి చెప్పారు. 

కాగా, బండి సంజయ్‌ ప్రసంగం సమయానికి ‘సీఎం సీఎం’అని ప్రజలు నినాదాలు చేశారు. దీంతో ‘సీఎం సీఎం’అనడంతోనే ఉన్న పదవిని పోగొట్టుకున్నానని.. దయచేసి ఎవరూ సీఎం అని నినాదాలు చేయవద్దని బండి విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు