అజారుద్దీన్‌కు కీలక పదవి

30 Nov, 2018 18:00 IST|Sakshi

టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా అజారుద్దీన్‌

పలువురిని కీలక పదవుల్లో నియమించిన అధిష్టానం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ పలువురు నేతలకు కీలక పదవులను కట్టబెట్టింది. గతకొంత కాలంగా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు ఉంటున్న మాజీ ఎంపీ, మహ్మద్‌ అజారుద్దీన్‌ను తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సమయం​ దగ్గర పడుతున్న వేళ అజరుద్దీన్‌ను కీలక పదవిలో నియమించడంతో మైనార్టీ ఓట్లను దండుకోవచ్చనే వ్యూహంతో ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది.

ఇదివరకే అజారుద్దీన్‌ను స్టార్‌ క్యాంపెయిర్‌గా నియమించినప్పటికీ ఆయన కొంత అసహనంతో ఉన్నారు. దీంతో ఆయన అవసరాలను, సేవలను గుర్తించిన కాంగ్రెస్‌.. కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమించింది. ఆయనతో పాటు పలువురికి కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ పార్టీలు నేతలు డాక్టర్‌ బీ.ఎం వినోద్‌ కుమార్‌, జాఫర్‌ జావేద్‌లను పార్టీ వైస్‌ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరితోపాటు మరికొందరికి పార్టీ సెక్రటరీలుగా, జనరల్‌ సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించింది.

దేశమంతటా పర్యటిస్తా...
పార్టీలో కీలక పదవి దక్కడంపై అజారుద్దీన్‌ స్పందించారు. పార్టీలో 18 ఏళ్లు చేసిన సేవకుగాను కాంగ్రెస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడిగా తనకు దక్కిన పెద్ద గౌరవమని  ఆనందం వ్యక్తం చేశారు. క్రికెట్‌లో జట్టుగా ఉన్న సమయంలో పెద్ద బాధ్యతను నిర్వర్తించానని.. మరలా ఇప్పుడు ఈ బాధ్యతను మోస్తున్నానని అభిప్రాయపడ్డారు. తనను కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమించినందుకు యూపీఏ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీకి, రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, కాంగ్రెస్‌ పార్టీ దేశానికి ఎనలేని సేవచేసిందని గుర్తుచేశారు. క్రికెట్‌ ఆడేందుకు తనకు శక్తిలేదని, కానీ కాంగ్రెస్‌ కోసం దేశమంతటా పర్యటిస్తానని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేయడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు