తెలుగు రాష్ట్రాల సీఎంలకు భయం పట్టుకుంది

18 Apr, 2018 19:40 IST|Sakshi
జీవీఎల్‌ నర్సింహారావు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు అన్నారు. వాళ్ల ఉనికి కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల సీఎంలు వారి స్థాయి మరిచి ప్రధానమంత్రి మోదీపై బురద జల్లుతున్నారని ఎంపీ మండిపడ్డారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్‌ కుటుంబంలో బంగారం మాయం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

అప్పుడు ఐదు రాష్ట్రాలు.. ఇప్పుడు 21 రాష్ట్రాలు
‘మొదట్లో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. ఏ ప్రభుత్వం చేయని పనులు మా ప్రభుత్వం చేసింది. బీజేపీ విస్తరణ కొనసాగుతూ వస్తుంద’ని రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు.

కేవలం మోదీని తిట్టడానికే ఈ సభలు
‘కమ్యూనిస్టులు కేవలం నరేంద్ర మోదీని తిట్టడానికే జాతీయ మహాసభలు పెట్టుకున్నారు. మోదీ చేతిలో త్రిపురలో కమ్యూనిస్టు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తిట్టడం ద్వారానే వారు ఆనందం పొంతున్నార’ని ఆయన అన్నారు.

ఉనికి కోసం ఆరోపణలు..
తన ఉనికి కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌ పార్టీ మోదీపై ఆరోపణలు చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని చెప్తున్నారు. కాం​గ్రెస్‌ హయాంలో కేవలం రూ.3 లక్షల కోట్లు ఇచ్చారు.. కానీ మా ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు. అంతేకాక 8 కోట్ల కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లు, 4 కోట్ల కుటుంబాలకు కరెంట్‌ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం 50 శాతం నిధులను నేరుగా రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. ఏదైనా ఒక విషయం మాట్లాడేప్పడు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. పేద వారికి సాయం చేసే పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమే అని రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ ధీమా వ్యక్తం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తాం..
దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో భూ స్థాపితం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఓడిపోతామనే భయంతో వారు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు.. అందుకే ఫ్రంట్‌లతో పేరుతో ఊదరా గొడుతున్నారు.. ఎటువంటి ఫ్రంట్‌ వచ్చిన మోదీకి ప్రతిఘటన ఇవ్వలేవని రాజ్యసభ ఎంపీ ధీమా వ్యక్తం చేశాడు. 

2019 ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది. తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలను చేస్తామని ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని రాజ్యసభ ఎంపీ జీఎల్‌వీ నర్సింహారావు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు