ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం

13 Nov, 2019 20:47 IST|Sakshi
ఎంపీ మర్గాని భరత్‌

సాక్షి, రాజమండ్రి: ఇసుక కొరత నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజమండ్రి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మర్గాని భరత్‌ తోసిపుచ్చారు. ఇసుక విషయంలో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యానానికి సిద్ధమని ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సవాల్‌ విసిరారు. బుధవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుత పాలన చేస్తూంటే జీర్ణించుకోలేని చంద్రబాబు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఇసుకను తరలించానని తనపై టీడీపీ ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అని ఆయన ధ్వజమెత్తారు. 

తాను ఇసుక నుంచి ఒక్క రూపాయి సంపాదించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుడిని ఎంపీగా ఎన్నికైతే..తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో టీడీపీకి చెందిన మురళీమోహన్‌, ఆయన బంధువులు ఇసుక నుంచి వందల కోట్లు దోచారని, ఇందులో చంద్రబాబుకు కూడా షేర్‌ ఉందన్నారు. పెందుర్తి వెంకటేశ్వర్లు కూడా ఇసుక పేరుతో దోచుకున్నారని విమర్శించారు. తనపై బురద చల్లచడం సిగ్గుచేటు అన్నారు. 

ప్రజలు ఎవరూ కూడా టీడీపీ నేతలను నమ్మే పరిస్థితి లేదన్నారు. 23 సీట్లు  ఇచ్చారంటే రాష్ట్ర ప్రజలు ఏరకంగా తిరస్కరించారో జ్ఞానోదయం చేసుకోవాలన్నారు. సుమారు 800 ఎకరాలల్లో ఇసుక తవ్వకాలు చేసి టీడీపీ నేతలు ఎలా దోచుకున్నారో అందరికి తెలుసు అన్నారు. తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రచారం కోసం చంద్రబాబు వందల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాధనాన్ని ఆదా చేస్తూ సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని, సుపరిపాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప‍్పటికైనా టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని మర్గాని భరత్‌ హితవు పలికారు.

మరిన్ని వార్తలు