అయోధ్య సమస్యకు కాంగ్రెసే కారణం

4 Dec, 2019 03:09 IST|Sakshi

జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారసభల్లో మోదీ

జంషెడ్‌పూర్‌/ఖుంతి: కాంగ్రెస్‌ నాన్చుడు ధోరణి కారణంగానే అయోధ్య వివాదం, ఆర్టికల్‌ 370 ఏళ్లపాటు కొనసాగాయని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ అవినీతిమయ, అస్థిర పరిపాలన సాగించిందని ఆరోపించారు. మంగళవారం ప్రధాని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, ఖుంతిల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను, అయోధ్యలో రామజన్మభూమి సమస్యను కాంగ్రెస్‌ పార్టీ దశాబ్దాలపాటు పట్టించుకోలేదని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ చిక్కుముళ్లను మా ప్రభుత్వం పరిష్కరించింది. ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్య వివాదం ఇలాంటివే.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆర్టికల్‌ 370 ఉంది. అది రాజ్యాంగంలో చేర్చిన తాత్కాలిక నిబంధన. అయినా కాంగ్రెస్‌ తొలగించలేదు. ఆ పార్టీ ప్రభుత్వాలు చేయలేకపోయిన పనిని మేం చేసి చూపాం. ఆర్టికల్‌ 370ను తొలగించాం. అలాగే, రామ జన్మభూమి సమస్య. మేం అధికారంలోకి వచ్చాక ఈ సమస్య పుట్టిందా? దీన్ని పరిష్కారం కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్‌ కాదా? అలా చేయడం ఓటు బ్యాంకు రాజకీయం కాదా?’అని ప్రశ్నించారు.

జార్ఖండ్‌లో అత్యధికంగా ఉన్న ఆదివాసీ ఓటర్లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘అయోధ్య యువరాజుగా ఉన్న శ్రీరాముడు.. వనవాసం సమయంలో ఆదివాసీలతో గడిపి, వారి జీవనవిధానాన్ని అలవర్చుకుని మర్యాద పురుషోత్తముడిగా మారాడు’అని పేర్కొన్నారు. గతంలో జార్ఖండ్‌లో కాంగ్రెస్‌–జేఎఎం కూటమి ప్రభుత్వాలు అవినీతిమయంగా నడిచాయన్నారు. ముఖ్యమంత్రి కుర్చీని సైతం అమ్మకానికి పెట్టాయన్నారు. ఆ కూటమి హయాంలో 15 ఏళ్లలో పది మంది సీఎంలు మారారన్నారు. 

మరిన్ని వార్తలు