కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌లది డమ్మీ పోరాటం: మోదీ

27 Nov, 2018 16:31 IST|Sakshi

కేసీఆర్‌కు వీడ్కోలు పలకాల్సిన ఎన్నికలు

మహబూబ్‌ నగర్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

సాక్షి, మహబూబ్‌ నగర్‌ : కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లది డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లాంటి డమ్మీ పోరాటమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాలమూరు ప్రజలకు నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోదీ.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘పాలమూరు అంటే పాలు, పెరుగుల సంగమస్థలని అర్థం. అలాంటి ప్రాంతం ఇప్పుడు కరువుతో అల్లాడుతోంది. పాలమూరులో వలసలెందుకు పెరిగాయని గత పాలకులను ప్రశ్నించాలి. కృష్ణా, తుంగభద్ర ప్రవహించినా.. ఈ నేల ఎందుకు ఎండిపోతుంది? ఒకే కుంటుంబంతో తెలంగాణ వచ్చిందా? ఒక కుటుంబం కోసమే తెలంగాణ యువత బలిదానం చేసిందా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ స్వభావం ఒకటే.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు రెండు కుటుంబ పాలన పార్టీలే. గత నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనలో మీకిచ్చిన హామీలు నెరవేరాయా? కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు, ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తున్నాయి. మరోసారి ఆ పార్టీలకు అధికారమిస్తే.. తెలంగాణ కోసం ఉద్యమించి బలిదానాలు చేసిన వారి శ్రమ వృథా. తెలంగాణ అంధకారంలోనెట్టబడుతుంది. చంద్రబాబు, సోనియాగాంధీ సర్కార్‌లలో పనిచేసిన కేసీఆర్‌ వల్ల ఇలాంటి అభివృద్ధే జరుగుతుంది. తెలంగాణ మెట్రో.. కేంద్రం సాయం ద్వారానే పూర్తైంది. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే మన బతుకులు చీకటి మయమే. బీజేపీ హయాంలో ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.’ అని  మోదీ ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు