నరేంద్రమోదీ ధైర్యం.. ప్రభుత్వం కొత్త ప్రయోగం..

30 Jun, 2018 14:32 IST|Sakshi
నరేంద్ర మోదీ(పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాలనా వ్యవస్థను మరింత మెరగు పర్చేందుకు ఐఏఎస్‌ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ ఎంతో కాలంగా ప్రతిపాదనలు వస్తున్నా గత ప్రభుత్వాలు అందుకు ధైర్యం చేయలేక పోయాయి. ఉన్నతాధికార పాలనా వ్యవస్థలోకి బయటి వారిని ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే సాధ్యమైంది. ఇక్కడ బయటి వారంటే దేశ, విదేశాల్లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నత చదువులు చదవడమే కాకుండా దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన కలిగిన విద్యావేత్తలు. 

భారతీయ అధికార వ్యవస్థను మనం ‘ఉక్కు కవచంగా’ వర్ణిస్తాం. ‘అసియాస్‌ మోస్ట్‌ ఇనెఫిషెంట్‌ (ఆసియాలోనే అత్యంత అసమర్థ వ్యవస్థ)’గా హాంకాంగ్‌లోని ‘పొలిటికల్‌ అండ్‌ ఎకనామిక్‌ రిస్ట్‌ కన్సల్టెన్సీ’ అభివర్ణిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ ఉన్నతాధికార యంత్రాంగంలోకి బయటి వారిని ఆహ్వానించడం సముచిత నిర్ణయమే. కాని దాన్ని అమలు చేసే విధానంలోని దాని జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఎలాంటి విధానం అమలు చేయాలో తెలియాలంటే ముందుగా ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను గ్రహించాలి.

ఐఏఎస్‌లకు వృత్తిరీత్యా, ఆర్థికంగా సరైన రాయతీలు కల్పించక పోవడం ప్రధాన లోపం. సీనియారిటీ పరంగా కాకుండా నైపుణ్యం, పోటీతత్వం ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలి. ఆర్థిక రాయతీలు కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. భారతీయ అమెరికన్‌ సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌ సంస్థకు 43వ ఏటనే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా నియమితులయ్యారంటే అమెరికాలో అలాంటి వ్యవస్థ ఉండడమే కారణం.

ఆయనే కనుక భారత్‌లో ఉండి ఉంటే మన అధికార యంత్రాంగంలో మధ్యస్థాయి జాయింట్‌ సెక్రటరీ అయ్యేవారు. సివిల్స్‌లో దేశమంతా సీనియర్లకు పదోన్నతి అవకాశాలను మెరగుపరుస్తూనే వారే తమ జూనియర్లను ప్రోత్సహించే విధంగా రాయతీలు ఉండాలి. మంచి సమర్థత కలిగిన, ఐఏఎస్‌ కాని అధికారులను కూడా ఐఏఎస్‌ క్యాటగిరీలోకి తీసుకోవాలి. అలా కూడా అధికారుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. 

ఐఏఎస్‌ల విధుల నిర్వహణలో రాజకీయ జోక్యం అసలు ఉండకూడదు. రాజకీయ జోక్యాన్ని కూడా పట్టించుకోకుండా నిజాయితీయిగా, సమర్థంగా అక్కడక్కడా పని చేస్తున్న జిల్లా కలెక్టర్ల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. వారి ప్రమోషన్ల కోసం జిల్లా వార్షికాభివృద్ధి సూచికలను పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి సూచికల పరిధిలోకి సామాజిక, ఆర్థికాభివృద్ధి అంశాలు వస్తాయన్న విషయం తెల్సిందే.

ఐఏఎస్‌లోకి అభ్యర్థులను ఆకర్షించడానికి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ తరహాలోనే ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ కాలేజీలు ఉండాలి. వారికి అమెరికాలోని ‘కొలంబియా యూనివర్శిటీ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’లో మాస్టర్‌ డిగ్రీ చేసే అవకాశం ఉండాలి. మన ఐఏఎస్‌లకు సాధారణ శిక్షణకు పరిమితమైన ‘లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ను అన్ని విధాల లోతుగా అధ్యయనం చేసే అకాడమీగా తీర్చిదిద్దాలి.

మరిన్ని వార్తలు