నయీమ్‌ డైరీని బయట పెట్టాలి

25 Jan, 2018 05:09 IST|Sakshi

సీపీఐ నేతృత్వంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ డైరీ వివరాలను బయటపెట్టాలని సీపీఐ నేతృత్వంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌ చేశారు. నయీమ్‌ కేసును సీబీఐతో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మఖ్దూం భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 12న హైదరా బాద్‌లో నయీమ్‌ బాధితులతో ముఖాముఖి సదస్సును నిర్వహించాలని తీర్మానిం చారు. నయీమ్‌ ఆస్తులతో పాటు అతనితో సంబంధమున్న రాజకీయ నేతలు, పోలీసుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నయీమ్‌ కేసులో తీసుకున్న చర్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. భువనగిరి, వరంగల్, హైదరాబాద్‌లలో నయీమ్‌ బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక బుక్‌లెట్‌ విడుదల చేయనున్నట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.  సమావేశంలో మానవ హక్కుల వేదిక కన్వీనర్‌ జీవన్‌కుమార్, సీపీఎం నేత నర్సింగరావు, పౌరహక్కుల సంఘ నేత నారాయణరావు, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, గాదె ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

 రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన: చాడ
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మఖ్ధూమ్‌ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని వివరించారు. ముందస్తు ఎన్నికలు, 2018 మహాసభల నిర్వహణ, పంచాయతీ రాజ్‌ చట్టం తదితర అంశాలపై తమ కార్యవర్గ సమావేశం చర్చించిందని తెలిపారు. జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌కు తన మాటలపై తనకే స్పష్టత లేదని చాడ విమర్శించారు

మరిన్ని వార్తలు