ధర్మ పోరాటమా.? సెల్ఫీల ఆరాటమా?

12 Feb, 2019 16:30 IST|Sakshi

సోషల్‌ మీడియాలో నిలదీస్తున్న నెటిజన్లు

సాక్షి, హైదరాబాద్‌ : దేశరాజధానిలో ధర్మపోరాట దీక్షతో సరికొత్త నాటకానికి తెరలేపిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ బాబు, తెలుగు తమ్ముళ్లపై సోషల్‌ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. గత నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి అప్పట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘నవనిర్మాణ దీక్షలు’ చేపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించి కాంగ్రెస్‌తో జతకట్టి అదే బీజేపీపై ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని, జస్ట్‌ పార్టీలు అటు ఇటు మారాయి కానీ చంద్రబాబు ధోరణి మాత్రం మారలేదని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు చేసిన దీక్షలతో రాష్ట్రానికి, జనాలకు ఒరిగిందేమి లేదని, అనవసరంగా ప్రజాధనం వృథా తప్ప.. ఎలాంటి ప్రయోజనం లేదని నిట్టూరుస్తున్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో తానా అంటే తందాన అన్నట్టు వ్యవహరించిన చంద్రబాబు..  సరిగ్గా ఎన్నికల ముందు హోదాపై యూటర్న్‌ తీసుకొని..దీక్షల పేరిట హడావిడి చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. (చదవండి : చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’)

పోనీ ఆ దీక్షనైనా సరిగ్గా చేస్తున్నారా అంటే అది లేదని, అది ధర్మపోరాటం లెక్క లేదని సెల్ఫీల కోసం ఆరాటంలా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. నల్ల దుస్తులేసుకొని ఫొటోలకు పొజివ్వడం తప్ప.. తెలుగు తమ్ముళ్లలో చిత్తశుద్ధి కనిపించడం లేదంటున్నారు. నిజంగా ప్రత్యేక హోదా కోసమే పోరాటం చేయాలనుకుంటే ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ఆంధ్రా ప్రజల ఆవేదన బలంగా కేంద్రానికి వినిపించి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. హోదా కోసం ప్రతిపక్ష పార్టీ చేసిన ప్రతీ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆనాడే చిత్తశుద్ధితో హోదా పోరాటంలో ప్రతిపక్ష పార్టీతో కలిసి వస్తే.. హోదా వచ్చి ఉండేదని, హోదా రాకపోవడానికి చంద్రబాబు, టీడీపీయే కారణమని మండిపడుతున్నారు. అప్పుడు ప్యాకేజీయే ముద్దు.. హోదా సంజీవినా? ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని ఊదరగొట్టిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో వెన్నులో వణుకుపుట్టి.. ఇప్పుడు కొత్త నాటకాలు ఆడుతోందని ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు. పోనీ ఆ పోరాటమైనా.. కొత్తగా చేస్తున్నారా అంటే అది లేదని, ప్రతిపక్ష నేత గత నాలుగేళ్లుగా హోదా కోసం చేసిన ఒక్కో కార్యక్రమాన్ని ఎన్నికల ముందు బాబుగారు కట్‌ అండ్‌ పేస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా బాబూ.. ఈ పోరాటాలతో ఒరిగేది ఏం లేదని, తమ డబ్బులు అనవసరంగా తగలెయ్యవద్దని వేడుకుంటున్నారు. (చదవండి: అయ్యో.. లోకేష్‌ అది కూడా తెలియదా?)

మరిన్ని వార్తలు