‘ఎన్నికల కాల వ్యవధిని తగ్గించండి’

19 May, 2019 10:50 IST|Sakshi

సాక్షి, పట్నా: సార్వత్రిక ఎన్నికల కాల వ్యవధిని తగ్గించాలని బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు. లోక్‌సభ ఎన్నికల ఏడో విడతలో భాగంగా ఆదివారం ఉదయం పట్నాలో నితీశ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రతి విడత పోలింగ్‌కు మధ్య ఎక్కువ వ్యవధి ఉంచరాదని అన్నారు. ఎన్నికలను త్వరగా పూర్తిచేస్తే ఓటర్లకు చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇంత సుదీర్ఘ కాలం ఎన్నికల నిర్వహణ అవసరమా అని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి అన్ని పార్టీల నేతలకు లేఖలు రాస్తానని తెలిపారు.

అలాగే భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌, గాడ్సేను సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్యలపై నితీశ్‌ స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నితీశ్‌ తప్పుపట్టారు. ఆమెపై చర్యలు తీసుకోవడం అనేది బీజేపీ అంతర్గత అంశమని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించదని స్పష్టం చేశారు. కాగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని జేడీ(యూ), బీజేపీతో కలిసి బిహార్‌ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు