బీసీ కోటా 24 శాతం లోపే!

17 Dec, 2018 04:36 IST|Sakshi

గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గరిష్టంగా 50 శాతమే రిజర్వేషన్లు

సాక్షి. హైదరాబాద్‌: త్వరలో జరగనున్న పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23–24 శాతానికి మధ్య పరిమితం కానున్నా యి. ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఎన్నికల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. సుప్రీం కోర్టు తీర్పు మేరకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర న్యాయ శాఖ శనివారం రాత్రి అత్యవసర ఉత్తర్వులు (ఆర్డినెన్స్‌) జారీ చేసిం ది. కొత్తగా అమల్లోకి వచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 34 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం పొందుపరిచింది. ఎన్నికల్లో 2011 జనా భా లెక్కల ఆధారంగా పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉండగా, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లను కేటాయించాల్సి ఉంది.

దీనికి తోడు పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం కోటా అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 60.19 శాతానికి పెరిగిపోనున్నాయి. పంచాయతీరాజ్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేసేందుకు సుప్రీం కోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేయడం ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు జరిపింది. సర్పంచ్‌ పదవుల కోసం జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎస్టీ, ఎస్సీలకు వరుసగా 5.73 శాతం, 20.46 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు 23.81 శాతం కోటా మాత్రమే లభించే అవకాశముంది.

గత జూన్‌ 12న పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 12,751 సర్పంచ్‌ స్థానాలుం డగా, షెడ్యూల్‌ ప్రాంతంలోని 1,308 పంచాయతీల తో పాటు 100 శాతం ఎస్టీల జనాభా కలిగిన 1,326 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అవనున్నాయి. దీనికి తోడు 5.73 శాతం ఎస్టీ కోటా కింద రానున్న 580 స్థానాలకు కలిపి ఎస్టీలకు మొత్తం 3,214 సర్పంచ్‌ పదవులు రిజర్వు అవుతాయి. ఎస్సీలకు 20.46 శాతం కోటా కింద 2,070 స్థానాలు రిజర్వు కానున్నాయి. 34 శాతం కోటా కింద అప్పట్లో బీసీలకు 3,440 స్థానాలకు కేటాయించారు. తాజాగా ఆర్డినెన్స్‌ మేరకు బీసీ కోటాను 24 శాతానికి లోపు తగ్గించనుండటంతో ప్రాథమిక అంచనాల ప్రకారం బీసీలకు కేటాయించే సర్పంచ్‌ స్థానాల సంఖ్య 2,784 కు తగ్గే అవకాశముంది.

రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. చివరిసారిగా 2013–14లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమ లు చేయగా, ఒక్కసారి 10 శాతానికి పైగా రిజర్వేషన్లు తగ్గిపోనుండటంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కోటా 24 శాతం లోపే పరిమితం కానుంది.  

>
మరిన్ని వార్తలు