‘టీడీపీ తూట్లు పొడిచి.. వ్యర్ధమైన ప్రసంగాలు’

20 Jul, 2018 17:02 IST|Sakshi
పవన్‌ కల్యాణ్

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అవిశ్వాసంపై టీడీపీ వాదన బలహీనంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సరైన రీతిలో ప్రస్తావించిలేకపోయారని పవన్‌ అన్నారు. ‘పార్టీకోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీ పడిందన్నారు. ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు. ఏపీ ప్రజల మనసును గెలిచే సువర్ణావకాశాన్ని తెలుగుదేశం పార్టీ చేజార్చుకుంది.

గతంలో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రత్యేక హోదాను టీడీపీనే గతంలో వ్యతిరేకించింది. ఏపీ ప్రజలు టీడీపీ నాయకులకు ఎలా కనిపిస్తున్నారు. వ్యక్తిగత లాభాల కోసం ‘స్పెషల్‌ క్యాటగిరి స్టేటస్‌’కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు కేంద్రం వంచన తెలియాటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా ?

ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి, ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లల లాగా.. కేంద్రం చేత మోసగింపపడ్డాం.. అంటే ప్రజలు నమ్ముతారు.. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు? ’ అని పవన్ కల్యాణ్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు