పవన్‌కళ్యాణ్‌ టీడీపీ ఏజెంటే

9 Feb, 2018 07:05 IST|Sakshi
మాట్లాడుతున్న వడిత్యా శంకర్‌నాయక్‌

గిరిజనుల జోలికొస్తే పుట్టగతులుండవ్‌

గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్‌

అనంతపురం న్యూటౌన్‌: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ గిరిజనుల జోలికొస్తే పుట్టగతులుండవని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌ నాయక్‌ హెచ్చరించారు. గురువారం స్థానిక బల్లా సమావేశ హాలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిజనుల రిజర్వేషన్లను దెబ్బతీస్తున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ప్రజావ్యతిరేక వైఖరిని తప్పుపట్టారు. బోయలను ఇప్పటికే ఎస్టీ జాబితాలో చేరుస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వానికి మరోసారి మత్స్యకారులను, వడ్డెర్లను కూడా చేర్చాలని పవన్‌కల్యాణ్‌ చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల స్థితిగతులపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు  రిజర్వేషన్ల జోలికి రావడం సరికాదన్నారు.

గిరిజనులు తమ రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాడుతుంటే ఎక్కడ గిరిజన సభలు జరిగినా అక్కడ పవన్‌కల్యాణ్‌ను పంపడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. ఆ నేపథ్యంలోనే తొలుత అనంతపురం జరిగిన సభకు అడ్డొచ్చిన పవన్, మరోసారి ఈనెల 21న మరోసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు రావడం చూస్తుంటే ఆయన జనసేన నేతగా కాకుండా కుల సంఘం నాయకుడిగా కనిపిస్తున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వారు చేస్తున్న మోసాలను గిరిజనులు గ్రహించి, త్వరలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో జీవీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్, కదిరి జాక్‌ నాయకులు రాం ప్రసాద్‌నాయక్, రమేష్‌నాయక్, బాపూజీ నాయక్, చంద్రానాయక్‌ (చిత్తూరు)వినోద్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు