‘ఐదు రోజుల్లోనే పింఛన్లు మంజూరు చేస్తాం’

4 Feb, 2020 14:55 IST|Sakshi

సాక్షి, అమరావతి : అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనర్హులను మాత్రమే తొలగించామని, సమగ్ర విచారణ అనంతరం ఇంకా అనర్హులుంటే తొలగిస్తామని స్పష్టం చేశారు. అర్హతలు ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఐదు రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. నిరంతరం ఈ ప్రక్రియ చేపడతామని తెలిపారు. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా పెన్షన్లను తొలగించారని మంత్రి గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో 50 లక్షల 50 వేల మందికి పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీదేనని రామచంద్రారెడ్డి అన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో అర్హులు, అనర్హులు జాబితాలను పెట్టామని ఆయన వెల్లడించారు. రూ.15 వేల కోట్లు పెన్షన్లకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. చంద్రబాబు హయాంలో భర్త ఉన్న మహిళలకు కూడా వితంతు పెన్షన్ల ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికే 4 లక్షల మంది అనర్హుల పింఛన్లు తొలగించామని తెలిపారు. బాబు సొంత గ్రామమైన నారావారి పల్లెలో కూడా పారదర్శకంగా పెన్షన్ల జాబితా పెట్టామని, కానీ ఆయన తమపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు