మోదీ వ్యాఖ్యల పట్ల రఘువీరా ఆగ్రహం

11 Feb, 2018 19:13 IST|Sakshi
ఏపీసీసీ చీఫ్‌ రఘవీరారెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి : పార్లమెంటులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులను కాంగ్రెస్‌ పార్టీ అవమానానికి గురిచేసిందంటూ మోదీ వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నెహ్రూ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, ప్రేమను కనబరుస్తూ నెహ్రూకే లేఖ రాసిన పటేల్‌ గురించి మీరు(మోదీ) మాట్లాడటం మీ కుటిల రాజకీయ ఎత్తుగడ తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. లేఖలో ఏం పేర్కొన్నారంటే.. ఏపీ విభజన జరిగి 4 సంవత్సరాలు గడుస్తున్నా పునర్వవస్తీకరణ చట్టంలోని అంశాలు అమలు కావడం లేదని అన్నారు. రాష్ర్ట విభజనను దేశ విభజనతో పోల్చి మోదీ మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు.

1. పార్లమెంటు తలుపులు వేసి రాష్ర్ట విభజన చేసింది కాంగ్రెస్‌ అని విమర్శించారు. ఏదైనా బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్‌ జరిగేటపుడు తలుపులు మాస్తారా లేక తెరుస్తారా? మీరు(మోదీ) సమాధానం చెప్పాలి.
2. తలుపులు మూసి కాంగ్రెస్‌ విభజన చేసినపుడు ఆనాటి ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎందుకు విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ బిల్లును ఎందుకు వ్యతిరేకించలేదు?
3. తిరుపతి ఎన్నికల సభలో.. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువే ఇస్తామని మమ్మల్ని గెలిపించమని కోరారా లేదా?
4. 2014 ఎన్నికల్లో నెల్లూరులో ఏపీకి ప్రత్యేక హోదా వెంకయ్యనాయుడే సాధించారని కనుక ఆ ఘనత తమదేనని మీరు చెప్పారా లేదా?
5. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను 10 ఏళ్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారా లేదా?
6. మీరు అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలపాటు హోదా అమలు చేస్తామన్నా అమలు చేయకపోవడంతో ప్రజా ఉద్యమం పెల్లుబికి ఏపీ అసెంబ్లీ రెండు సార్లు హోదా అమలుల చేమయని ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీకు పంపిందా లేదా? మీ పార్టీ ఆ తీర్మానాన్ని రాష్ర్టంలో బలపర్చింది వాస్తవమా కాదా?
7. ఏపీ ముఖ్యమంత్రికి 16 నెలల పాటు మీరు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వకపోవడం ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానానికి గురి చేయడం కిందకు వస్తుందా రాదా?

ఏపీ విభజన అంశంలో కాంగ్రెస్‌ పార్టీ తనకు తానుగా నష్టపోయింది కానీ ఏపీ ప్రజలకు అన్యాయం చేయలేదన్నారు. అందుకే ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా, లాంటి అనేక అంశాలను ఏపీకి ఇస్తూ చట్టం చేసిందని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను, కేబినేట్‌ నిర్ణయాలను అమలు చేయాలని ఏపీ ప్రజల తరపున తమరికి(మోదీ) అభ్యర్థిస్తున్నట్లు లేఖ ద్వారా తెలిపారు.

మరిన్ని వార్తలు