ఆ రెండు పార్టీలపై కమల్, రజనీ కన్ను

29 May, 2018 08:40 IST|Sakshi

సభ్యత్వ నమోదు లక్ష్యం కోసం కొత్త వ్యూహం

అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలపై దృష్టి

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అన్ని పార్టీలూ తంటాలు పడుతున్నాయి. కొత్తగా రాజకీయాల్లో కాలుమోపిన నటులు కమల్‌హాసన్, రజనీకాంత్‌ డీఎంకే, అన్నాడీఎంకే ఓటర్లతో పాటు పార్టీ సభ్యత్వానికీ  కన్నం వేసే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. ఆ పార్టీల కార్యకర్తలపై గురిపెట్టి సభ్యత్వ లక్ష్యాన్ని సాధించేందుకు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల్లోని అసంతృప్తిని గమనిస్తున్న కమల్, రజనీ ఆ పార్టీ  కార్యకర్తలపై కన్నేశారని తెలుస్తోంది. తమ పార్టీల్లో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ విరామం తరువాత తమిళ సినీరంగం నుంచి ఇద్దరు అగ్ర నటులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. వెండితెరపై ఒకరిది మాస్, మరొకరిది క్లాస్‌. రాజకీయ తెరపై కూడా రజనీది ఆధ్యాత్మిక పార్టీ, కమల్‌ది ఇందుకు పూర్తిగా నాస్తిక పార్టీగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే నేను నాస్తిక వాదిని, నా పార్టీ కాదు అని కమల్‌ ఇటీవల వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ప్రజల మదిలో మాత్రం అన్నాడీఎంకేలా ఆధ్యాత్మిక ధోరణిలో రజనీ, డీఎంకేలా నాస్తికవాదంలో కమల్‌ రాజ కీయ ప్రయాణం సాగుతోందని, కేవలం ఈ ఒక్క విషయంలో ఆ రెండు పార్టీలకు ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయాలని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా ఇప్పటికే ఏదో ఒక పార్టీలో చురుగ్గా ఉండే కార్యకర్తలనే ఆకర్షించక తప్పదు. ఏదో కొద్ది శాతం మినహా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారంతా ఏదో ఒక పార్టీలో సభ్యులుగా కొనసాగుతుంటారు.

రాష్ట్రంలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలున్నా రాజకీయంగానేగాక, సభ్యత్వపరంగా కూడా డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే బలమైనవిగా భావించవచ్చు. అయితే అమ్మ మరణం, నాయకత్వ లేమితో అన్నాడీఎంకే బాగా బలహీనపడిపోయింది. ఇక పార్టీలోని భిన్న ధ్రువాలుగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తేవడం అసాధ్యమని తేలిపోయింది. అన్నాడీఎంకేలో జనాకర్షణ ఉన్న నేత కరువయ్యాడు. ఏటా జరిగే సభ్యత్వ నమోదుకు, పునరుద్ధరణకు వేలాదిగా కార్యకర్తలు ముందుకు వచ్చేవారు. అన్నాడీఎంకే కార్యాలయం కిటకిటలాడి పోయేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదుకు పార్టీ కార్యాలయ తలుపులు తెరుచుకోగా గతంలో లాగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక డీఎంకే కార్యకలాపాలను అధ్యక్షుడు కరుణానిధి అస్వస్థకు గురికావడం కొందరిలో నిరాశను కలిగించింది. అమ్మ చనిపోయిన కొద్దిరోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చు, వచ్చిన అవకాశాలను పార్టీ సద్వినియోగం చేసుకోవడం లేదని కొందరు అని అసంతృప్తితో ఉన్నారు.

ఇలా రెండు పార్టీల్లోని అసంతృప్తిని గమనిస్తున్న కమల్, రజనీ ఆ పార్టీల  కార్యకర్తలపై కన్నేశారు. తమ పార్టీల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలను అక్కున చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీలో సభ్యులైనపుడే తమ పార్టీకి చెందిన విజిల్‌ యాప్‌లో ఫిర్యాదులను నమోదు చేసేందుకు అర్హులవుతారని, అలా ఫిర్యాదులు చేసిన వారిని తాము తరచూ సంప్రదిస్తుంటామని కమల్‌ సంకేతాలు ఇచ్చారు. అలాగే రజనీ సైతం వీధికి కనీసం పది చొప్పున రజనీ మక్కల్‌ మన్రంలో సభ్యులుగా చేర్చాలని టార్గెట్‌ పెట్టారు. ఒక్కో వీధికి ఒక దరఖాస్తు ఫారం అందజేస్తున్నారు. ఈ ఒక దరఖాస్తు ద్వారా 30 మందిని సభ్యులుగా చేర్చవచ్చు. 1.50  కోట్ల సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెండు పార్టీల కార్యకర్తలను చేరదీయక తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎంకే మాజీ మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి రజనీ మక్కల్‌ మన్రం రాష్ట్ర నిర్వాహకులుగా నియమితులయ్యారు. డీఎంకేతో ఉన్న పరిచయాలను రజనీ పార్టీ సభ్యత్వ నమోదుకు సద్వినియోగం చేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు