కొడంగల్‌లో గులాబీ ప్రభంజనానికి కారణాలివే!

11 Dec, 2018 16:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఫైర్‌ బ్రాండ్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో అనూహ్యంగా పరాజయం చెందారు. ప్రజాకూటమి తరఫున కీలక నేతగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవ్వడం కాంగ్రెస్‌ శ్రేణులకు మింగుడు పడటం లేదు. కూటమి గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంతేనని జోరుగా ప్రచారం సాగిన సందర్భంలో అతని ఓటమి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రేవంత్‌ దూకుడే అతని కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే కొడంగల్‌ నుంచి రెండు సార్లు గెలిచిన రేవంత్‌.. ఈ సారి గెలిస్తే హ్యాట్రిక్‌ సాధించేవారు. కానీ రేవంత్‌ ఓటమే లక్ష్యంగా పావులు కదిపిన అధికార టీఆర్‌ఎస్‌ తమ వ్యూహాలను అమలు చేయడంలో విజయవంతమైంది. అనూహ్యంగా మంత్రి మహేందర్‌ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌ రెడ్డిని తెరపైకి తెచ్చి గట్టి సంకేతాలను పంపింది. టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌, వ్యూహకర్త హరీశ్‌రావుకు కొడంగల్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా.. ఈ నియోజకవర్గంపై గులాబీ అధినాయకత్వం ఎంతగా ఫోకస్‌ పెట్టిందో చెప్పకనే చెప్పింది.

రోజురోజుకు కొరకరాని కొయ్యగా తయారవుతూ.. ఏకంగా సీఎం కేసీఆర్‌నే సవాల్‌ చేస్తూ దూసుకుపోతున్న రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహాలు రచించింది.  కొడంగల్‌ బాధ్యతలు స్వీకరించిన హరీష్‌ రావు.. రేవంత్‌ ప్రధాన అనుచరులను టీఆర్‌ఎస్‌వైపు తిప్పుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. రేవంత్‌కు నియోజకవర్గంలో కుడిభుజం అనదగ్గ నేతలను టీఆర్‌ఎస్‌ మెల్లగా తనవైపు తిప్పుకుంది. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వేగాన్ని పెంచింది. ప్రత్యేక శ్రద్ధతో టీఆర్‌ఎస్‌ అగ్రనేతలు కొడంగల్‌లో ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావు, కేటీఆర్‌ కొడంగల్‌ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. వీటన్నింటితోపాటు రేవంత్‌రెడ్డి అతి విశ్వాసం కూడా ఆయనను కొంతమేరకు దెబ్బతీసిందని చెప్పవచ్చు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, డీకే అరుణతోపాటు రేవంత్‌రెడ్డి వంటి కాంగ్రెస్‌ ప్రధాన నేతలను టార్గెట్‌ చేసి.. టీఆర్‌ఎస్‌ ప్రత్యేక వూహ్యాలు రచించింది. దీంతో ఒక్క రేవంత్‌ రెడ్డి మినహా ఆయా నేతలు తమ నియోజకవర్గాలకు పరిమితమై.. ప్రచారంలో మునిగితేలారు.

రేవంత్‌ మాత్రం కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపైనర్‌గా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ కుటుంబం టార్గెట్‌గా మాటల దాడిని పెంచడంతోపాటు వ్యక్తిగత దూషణలకు దిగారు. చివరకు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి.. ఆఖరి దశలో కొడంగల్‌పై దృష్టి పెట్టారు. సీఎం కేసీఆర్‌ను సభను అడ్డుకుంటానని పేర్కొంటూ.. బంద్‌కు పిలుపునివ్వడం.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడం హైడ్రామాకు, ఉత్కంఠకు తెరతీసింది. అయినా, కొడంగల్‌లో కేసీఆర్‌ సభ విజయవంతం కావడం.. ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌ వ్యూహాలు విజయవంతంగా అమలుకావడంతో కొడంగల్‌లో రేవంత్‌కు ఓటమి తప్పలేదు. గతంలో రెండుసార్లు గెలిచిన రేవంత్‌పై నియోజకవర్గ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నట్లు తాజా ఫలితాలతో స్పష్టమైంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన రేవంత్‌.. అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్‌నాథ్‌ రెడ్డిపై 14,605 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ ఈ సారి నరేందర్‌ రెడ్డి చేతిలో సుమారు 10వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మొత్తం 19 రౌండ్లలో రేవంత్ రెడ్డి మొదట్లో కొంత ఆధిపత్యం చూపించినప్పటికీ  విజయం టీఆర్ఎస్ అభ్యర్థినే వరించింది. దీంతో కొడంగల్‌ గడ్డపై తొలిసారి గులాబీ జెండా రెపరెపలాడింది.

మరిన్ని వార్తలు