ప్రజల దృష్టి మరల్చేందుకే ‘ముందస్తు’ నాటకం

23 Aug, 2018 03:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల నాటకం మొదలుపెట్టారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లడగనని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఏ ముఖం తో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రగతి నివేదన పేరుతో కేసీఆర్‌ సెప్టెంబర్‌ 2న పెట్టనున్న సభ సాధ్యం కాదని జోస్యం చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున సభను వాయిదావేసుకోవడం ఖాయమ న్నారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే సభ పెట్టాలని రేవంత్‌ సవాల్‌ చేశారు. జనవరికల్లా ఓటర్‌ జాబితా సిద్ధం చేయాలని కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్రానికి లేఖ రాశారని, అలాంటప్పుడు ముందస్తు ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అసెంబ్లీ, లోక్‌సభలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం వల్ల ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలను సిద్ధం చేయడంలో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు