ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్‌

7 Dec, 2023 05:33 IST|Sakshi
బుధవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీ, ప్రియాంకలను కలసిన రేవంత్‌రెడ్డి

ఢిల్లీలో వారిని స్వయంగా కలసి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి 

కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్‌లతోనూ భేటీ 

తర్వాత పార్లమెంట్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. శుభాకాంక్షలు తెలిపిన వివిధ పార్టీల ఎంపీలు 

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటవుతోందంటూ ఖర్గే, రాహుల్‌ ట్వీట్లు 

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర కీలక నేతలు తరలిరానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రియాంక, 10:30 గంటలకు సోనియా, రాహుల్‌లు హైదరాబాద్‌కు చేరుకుంటారని గాం«దీభవన్‌ వర్గాలు తెలిపాయి. వారు విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్‌కృష్ణా హోటల్‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించాయి. 

స్వయంగా ఆహ్వానించిన రేవంత్‌ 
సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన రేవంత్‌ బుధవారం అంతా బిజిబిజీగా గడిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో.. సోనియా, రాహుల్, ప్రియాంకాగాందీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హరియాణా ఎంపీ దీపేందర్‌సింగ్‌ తదితరులతో విడివిడిగా భేటీ అయ్యారు.

గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంతకుముందు ఉదయమే ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు యమునా బ్లాక్‌లోని రేవంత్‌ నివాసానికి వచ్చి కలిశారు. వారు ఇరవై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. చర్చల విషయాన్ని బయటికి వెల్లడించలేదు. 

పార్లమెంట్‌లో అభినందనల వెల్లువ 
కాంగ్రెస్‌ అగ్రనేతలతో భేటీల తర్వాత రేవంత్‌ పార్లమెంట్‌కు వెళ్లారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి లోక్‌సభలోకి వెళ్లిన రేవంత్‌కు వివిధ పార్టీల ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ చాంబర్‌కు వెళ్లగా.. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్‌నాయుడు, ఎంపీ రఘురామకృష్ణ రాజు, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిరంజన్‌రెడ్డి, శ్రీధర్, ఇతర పార్టీల ఎంపీలు రేవంత్‌ను అభినందించారు. స్వీట్లు తినిపించారు.

ఈ సందర్భంగా ఆ ఎంపీలందరినీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని రేవంత్‌ ఆహ్వానించారు. పార్లమెంటుకు వెళ్లిన సమయంలో రేవంత్‌ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని భావించినా చేయలేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. ఢిల్లీకి వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని తెలిసింది. 

ప్రజా ప్రభుత్వం వస్తోందంటూ ఖర్గే, రాహుల్‌ ట్వీట్లు 
బుధవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి తమను కలిసిన ఫొటోలను ఖర్గే, రాహుల్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వస్తోందని పేర్కొన్నారు. ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్‌ నాయకులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని ఖర్గే పేర్కొనగా.. రేవంత్‌ నాయకత్వంలో వాగ్దానాలన్నీ నెరవేర్చుతామని రాహుల్‌ తెలిపారు. 

రేవంత్‌కు ఘన స్వాగతం 
అధిష్టానం పెద్దలను కలసిన అనంతరం రేవంత్‌ బుధవారం రాత్రి 10:20 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు, కాంగ్రెస్‌ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రేవంత్‌ నేరుగా హోటల్‌ ఎల్లాకు చేరుకున్నారు.  

మీ ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం 
నా ప్రమాణ స్వీకారానికి అందరూ రండి: రేవంత్‌రెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌:  సీఎంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని సీఎల్పి నేత ఎనుముల రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ‘‘తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్‌ 7న మధ్యాహ్నం 1:04 గంటలకు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వా నం..’’అంటూ బుధవారం బహిరంగ ఆహ్వాన లేఖను విడుదల చేశారు. 

కేసీఆర్, చంద్రబాబులకు పిలుపు! 
రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు జాతీయ నాయకులు, సీఎంలు, మాజీ సీఎంలకు టీపీసీసీ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబులను రేవంత్‌ ఆహ్వానించారని గాందీభవన్‌ వర్గాల సమాచారం. వీరితోపాటు ‘ఇండియా’కూటమిలోని 8 మంది సీఎంలు, కాంగ్రెస్‌కు చెందిన 51 మంది ఎంపీలకూ ఆహ్వానం పంపినట్టు తెలిసింది.

రాష్ట్ర కాంగ్రెస్‌లోని పలువురు సన్నిహిత నేతలు, సీనియర్‌ నాయకులకు రేవంత్‌ స్వయంగా ఫోన్లు చేసి రావాలని కోరారని.. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ప్రజాసంఘాల నాయకులనూ ఆహ్వానించామని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.   

>
మరిన్ని వార్తలు