బాబూ..ఒక్క హామీనైనా అమలు చేశారా?

24 Aug, 2018 12:05 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శిల్పా చక్రపాణి రెడ్డి, చిత్రంలో బీవై రామయ్య, ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి , హఫీజ్‌ఖాన్‌ తదితరులు

ఏ ముఖం పెట్టుకొని ధర్మ పోరాట దీక్షకు వస్తున్నారు?

ఒక్క గ్రామంలోనైనా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ పెట్టారా?

చంద్రబాబు హామీలపై 24న బహిరంగ చర్చకు రావాలి

తెలుగుకాంగ్రెస్‌ను పాతాళంలోకి తొక్కేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు శిల్పా, బీవై, ఐజయ్య, కాటసాని  

కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 స్వాతంత్య్ర దిన వేడుకల్లో జిల్లాకు 50 హామీలు ఇచ్చి, ఒక్కదాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ నెల25న ధర్మపోరాట దీక్ష చేయడానికి చంద్రబాబు..కర్నూలుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. చంద్రబాబు హామీలపై దమ్మూధైర్యం ఉంటే టీడీపీ నాయకులు 24వ తేదీన బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. 2014 ఎన్నికలకు ముందు వివిధ బ్యాంకుల్లో అన్నదాతలు కుదువపెట్టిన బంగారం ఎక్కడుందో చెప్పి చంద్రబాబునాయుడు ధర్మ పోరాట దీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు.

జిల్లాలో 40 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు తూతూమంత్రంగా రుణమాఫీ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఒక్క గ్రామంలో కూడా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయలేదని, అన్న క్యాంటీన్లు అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయన్నారు. రెయిన్‌గన్ల కొనుగోలులో పెద్ద అవినీతి జరిగిందన్నారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితులను వివరించకుండా ప్రత్యేక హోదాకు  సీఎం చంద్రబాబునాయుడు అడ్డుగా ఉన్నారన్నారు. కేవలం తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడానికే ధర్మపోరాట దీక్షలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఓటర్లను ప్రలోభ పెట్టడానికే అమరావతి బాండ్లను రూ. 60 వేల కోట్లకు కుదువ పెట్టడానికి సీఎం సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఈ తతంగంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

అధికారంలోకి వస్తే అవినీతిపైవిచారణ జరిపిస్తాం...
తెలుగుదేశం, కాంగ్రెస్‌ కలసి వచ్చినా వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేవని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.  తెలుగుకాంగ్రెస్‌ను పాతాళ లోకానికి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌తో పొత్తంటే ఉరేసుకుంటానన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి...ఏ తాడుతో సిద్ధమవుతారో ఆయనకే తెలియాలన్నారు. జిల్లాలో నీరు– చెట్టు పథకంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామన్నారు. నంద్యాల మైనర్‌ ఇరిగేషన్‌ ఈఈ.. అధికార పార్టీ నేతల తొత్తుగా మారిపోయారని విమర్శించారు. జిల్లాలో అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  

ధర్మం తప్పిందెవరో ప్రజలకు తెలుసు   
ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకొని.. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ధర్మం తప్పింది సీఎం చంద్రబాబునాయుడే అని ప్రజలకు తెలుసని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తికి ధర్మ పోరాట దీక్షలు చేసే హక్కులేదన్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన విజయమోహన్‌.. నీరు–చెట్టు పనుల్లో 20 శాతం కమీషన్‌తో రూ.150 కోట్లను టీడీపీ నాయకులకు కట్టబెట్టారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే అర్హత సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులకు లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కర్నూలు, నందికొట్కూరు సమన్వయ కర్తలు హఫీజ్‌ఖాన్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర నాయకులు తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, హనుమంతరెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసులు, నాయకులు కరుణాకరెడ్డి, గోపాల్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి, మహేశ్వరరెడ్డి, మహేష్‌ యాదవ్, పొలూరు భాస్కరరెడ్డి, కటారి సురేష్, విజయలక్ష్మి, జమీల పాల్గొన్నారు.  

చంద్రబాబుది వంచన దీక్ష
ధర్మపోరాట దీక్షను పార్టీ తరఫున చేస్తున్నారో.. ప్రభుత్వం తరఫున చేపడుతున్నారో స్పష్టం చేయాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అ«ధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందు నుంచి పోరాటం చేస్తున్నారని, దీనిని పట్టించుకోకుండా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని.. ఇప్పుడు ఎన్ని పోరాటాలు చేస్తే ఏమి లాభమని ప్రశ్నించారు. ఢిల్లీలో చేయాల్సిన దీక్షలు గల్లీలో చేస్తే ఏమి లాభమన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్నది ధర్మపోరాట దీక్ష కాదని..వంచన దీక్ష అని విమర్శించారు.

మరిన్ని వార్తలు