ఆదాయ పన్ను రద్దు సాధ్యమా?

5 Jul, 2019 01:00 IST|Sakshi

ప్రత్యక్ష పన్నుల ఎత్తివేతపై భిన్నాభిప్రాయాలు

రద్దుతో మానవాభివృద్ధికి విఘాతమేనంటున్న నిపుణులు

ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయం సమకూర్చుకోవాలంటున్నమరి కొందరు  

రెండంకెల వృద్ధి సాధించాలంటే పొదుపును పెంచాలి. ఆదాయ పన్ను రద్దు చేయాలి అన్నారు డాక్టర్‌ సుబ్రమణ్య స్వామి గతంలో ఓసారి. కొంతమంది రాజకీయవేత్తలు, ఆదాయ పన్ను నిపుణులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దీన్ని తెలివైన చర్యగా భావించవచ్చా? నిపుణులు ఏముంటున్నారో పరిశీలిద్దాం.

ఆదాయ పన్ను ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరు. భారత్‌ లాంటి దేశాల్లో పన్ను ఆదాయం సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. పన్ను నిపుణుల ప్రకారం.. 2016 –17లో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు 7.41 కోట్ల మంది. వీరి ద్వారా ప్రభుత్వానికి రూ. 8.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. మన జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2 శాతం మందే. జీడీపీలో ప్రత్యక్ష పన్నుల వాటా 5.98 శాతం మాత్రమే.

ఈ వాటాను పెంచడానికి బదులు, అసలు ఆదాయ పన్నునే రద్దు చేయాలన్న ఆలోచనను పలువురు ముందుకు తెస్తున్నారు. జనం చేతుల్లో మరింత డబ్బు ఉండేలా చేయడమనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. ‘పర్యవసానంగా డిమాండ్‌ పెరుగుతుంది. వ్యవస్థలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అంటున్నారు కేపీఎంజీ (ఇండియా)లో కార్పొరేట్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్యాక్స్‌ విభాగాధిపతి హిమాన్షు పరేఖ్‌. అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు, ఆర్థిక వ్యవస్థ అవసరాల కోసం భారీగా నిధులు కావాలి.

2030 నాటికి లక్ష గ్రామాల డిజిటలీకరణ, గ్రామాల పారిశ్రామికీకరణ, నదుల శుద్ధీకరణ, తీర ప్రాంత విస్తరణ, ఆహార రంగంలో స్వయం సమృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సౌకర్యాల కల్పన తదితర లక్ష్యాలు సాధించాల్సివుంది. ఈ నేపథ్యంలో పన్ను రద్దు ప్రతిపాదన అసంబద్ధమైనదే అవుతుందంటున్నారు పరేఖ్‌. పైగా  ప్రత్యక్ష పన్నుల విధానం న్యాయబద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు.

పన్నుల  మొత్తాలతోనే ప్రభుత్వాలు సమాజంలోని దిగువ తరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అమలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పన్నులను రద్దు చేయాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాల్సి ఉందంటున్నారు డెలాయిట్‌ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరి రంగన్‌. ప్రత్యక్ష పన్నుల రద్దు ద్వారా కోల్పోయే ఆదాయాన్ని – పరోక్ష పన్నులు పెంచడం వంటి ఇతరత్రా చర్యల ద్వారా సమకూర్చుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు.

ఆదాయ పన్ను రద్దు వల్ల పన్ను చెల్లింపుదారులు తమ డబ్బును పొదుపు మార్గాల్లోకి, పెట్టుబడుల్లోకి మళ్లిస్తారని, ప్రత్యక్ష పన్ను వ్యవస్థ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేసే ఖర్చు కూడా తగ్గుతుందని పలువురు పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇప్పటికే 3.4 శాతం ద్రవ్య లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య వ్యతిరేక ప్రభావం చూపుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుతం యూఏఈ, కేమన్‌ ఐలాండ్స్, బహమాస్, బెర్ముడా తదితర కొన్ని దేశాలు ఆదాయ పన్ను విధించడం లేదు.

పెద్ద దేశాలు మాత్రం పన్ను వసూలు చేస్తూనే ఉన్నాయి. నిజానికి, ప్రతి దేశమూ కనీసపాటి పన్ను విధించాలంటున్న ఓఈసీడీ – ఇందుకు శ్రీకారం కూడా చుట్టింది. ఆదాయ పన్నును రద్దు చేయడం వల్ల కొన్ని అనుకూలతలు దరి చేరవచ్చునేమో గానీ, భారత్‌లోని స్థూల ఆర్థిక దృశ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాన్ని రద్దు చేయకపోవడమే ఉత్తమం. ఇందుకు బదులుగా పన్ను రేట్లను తగ్గించడం, పన్ను విధానాన్ని మెరుగ్గా అమలు పరచడం అవసరం’ అంటున్నారు పరేఖ్‌. అమెరికా, బ్రిటన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆదాయ పన్ను వసూలు చేస్తుండటం, దానిపై ఆధారపడి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం. ప్రత్యక్ష పన్ను చట్టాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ ఈ నెల 31న తన నివేదిక సమర్పించనుంది.

మరిన్ని వార్తలు