ముగిసిన ప్రచారం.. ఆ రెండు రాష్ట్రాల్లో రేపే పోలింగ్‌

15 Nov, 2023 20:57 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో రేపే ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా.. నేడు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. దీంతో పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి. మధ్యప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, బీఎస్పీతోపాటు కమ్యూనిస్టు పార్టీలు బరిలో ఉన్నప్పటికీ భాజపా-కాంగ్రెస్‌ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఈ రెండు పార్టీల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది.

మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు గాను 5.6కోట్ల ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. అందులో 2.88 కోట్ల మంది పురుషులు కాగా 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36లక్షల మంది యువతీ యువకులు తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ నుంచి 29 మంది సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత..
ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి సంబంధించి తొలిదశలో 20 స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ పూరైంది. మరో 70 సీట్లకు రేపే పోలింగ్ జరగనుంది. రెండో దశలో మొత్తంగా 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. రెండో దశలో మొత్తం 1.63కోట్ల మంది ఓటర్లు ఈ అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. 

అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. బీజేపీ మాత్రం అధికార పార్టీపై తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణలతో ఇరుకున పడేసే ప్రయత్నం చేసింది. రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, ప్రియాంక గాంధీ వాద్రాలు ముమ్మరంగా ప్రచారం చేశారు. భాజపా తరఫున అమిత్‌ షా, జేపీ నడ్డా, హిమంత బిశ్వశర్మ, అనురాగ్‌ ఠాకూర్‌తోపాటు ఇతర నేతలు చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'పొట్టివాడే కానీ..' సింథియాపై ప్రియాంక గాంధీ ఫైర్‌

మరిన్ని వార్తలు