బుల్లెట్లు దించినవాడి కడుపులో తలపెడతావా?

29 Nov, 2018 17:29 IST|Sakshi

ఖమ్మం సభలో చంద్రబాబు-గద్దర్‌ ఆలింగనం ఫొటోపై సోషల్‌ మీడియాలో వాడీవేడి చర్చ

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు విప్లవ రాజకీయాలతో మమేకమై.. తన ఆటాపాటతో చైతన్యం తీసుకొచ్చి.. ప్రజాయుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌.. ఇటీవల పంథా మార్చుకున్నారు. ఒకప్పుడు విప్లవబాట శరణ్యమని.. తన పాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన ఆయన ఇప్పుడు ప్రజాస్వామిక రాజకీయాలే మార్గమంటున్నారు. నాడు నక్సలిజానికి ఆకర్షితులై అడవిబాట పట్టిన ఆయన.. నేడు రాజకీయ పార్టీలతో కలిసి బహిరంగ వేదికలు పంచుకుంటున్నారు. మారిన కాలమాన పరిస్థితుల్లో రాజకీయాల్లో గద్దర్ తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు తన కడుపులో బుల్లెట్లు దించిన చంద్రబాబునాయుడు కడుపులోనే గద్దర్‌ తాజాగా తలపెట్టడం ఇప్పుడు సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. ఖమ్మం జిల్లాలో బుధవారం ప్రజాకూటమి బహిరంగ సభ సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో కలిసి గద్దర్‌తోపాటు ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తదితరులు వేదిక పంచుకున్నారు. వేదికపై చంద్రబాబును పలుకరించిన గద్దర్‌.. ఆయన కడుపులో తలపెట్టినట్టు ఆలింగనం చేసుకోవడం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు-గద్దర్‌ ఆలింగనం చేసుకున్న ఫొటోను, వీడియోను షేర్‌ చేస్తున్న నెటిజన్లు.. ఒకప్పుడు బుల్లెట్లు దించిన చంద్రబాబునే ఇప్పుడు గద్దర్‌ ఆలింగనం చేసుకోవడం.. చంద్రబాబు సమక్షంలో గద్దర్‌ తెలంగాణమా అని గొంతెత్తి పాట పాడటంపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

మారిన గద్దర్‌ ధోరణి..!
ఇటీవలికాలంలో గద్దర్‌ ధోరణిలో మార్పు కనిపించింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేసిన ఆయన.. ఆకస్మికంగా ఆధ్యాత్మిక బాట పట్టి.. గుళ్లు, గోపురాలు తిరిగారు. వ్యక్తిగత పరిధిలో గద్దర్‌ ఆధ్యాత్మిక బాట పట్టడంలో తప్పేమీ లేదు కానీ.. ఆయన ప్రచారం చేసిన కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్మి ఎంతోమంది యువత అడవిబాట పట్టి ప్రాణాలు కోల్పోయారు. అమరుల కుటుంబాలకు గద్దర్‌ సమాధానం చెప్తారా అని నెటిజన్లు, ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామిక రాజకీయాలపై విశ్వాసం ప్రకటిస్తున్న గద్దర్‌.. ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసిన విషయం తెలిసిందే. తన కొడుకుకు టికెట్‌ ఇప్పించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారని వినిపించింది. ఆయన కొడుకుకు టికెట్టయితే రాలేదు కానీ.. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకి చేరువగా వచ్చిన గద్దర్‌.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఏర్పాటైన ప్రజాకూటమికి మద్దతుగా ప్రకటించారు. మహాకూటమి తరఫున గద్దర్‌ ప్రచారమూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం బహిరంగ సభలో చంద్రబాబు-గద్దర్‌ ఆలింగనం చేసుకోవడం.. సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. గద్దర్‌ ఈ స్థాయికి దిగజారుతాడని అనుకోలేదని, తెలంగాణను అన్నివిధాల వంచించిన చంద్రబాబు కడుపులో గద్దర్‌ తలపెట్టడం.. మారిన రాజకీయ పరిస్థితులను చాటుతోందని, ఏది ఏమైనా గద్దర్‌ తీరు తమను బాధించిందని తెలంగాణ ఉద్యమకారులు, నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ విషయంలో గద్దర్‌కు అనుకూలంగా కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు వెలువడుతున్నాయ్‌..

మరిన్ని వార్తలు