ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

22 Mar, 2019 08:35 IST|Sakshi

సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలోని ఉభయగోదావరి- కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా ఉపాధ్యాయుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి  పోలింగ్ జరుగుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించకపోవటంతో దాదాపు 93 మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,93,794 మంది ఓటర్లుండగా.. బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లుండగా.. 40 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.  విశాఖ-విజయనగరం- శ్రీకాకుళం ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది నామినేషన్లు వేసారు.

తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయ కోటాలో ఏడుగురు అభ్యర్థులు.. పట్టభద్రుల కోటాలో 17మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ మద్దతుతో గ్రూప్ వన్ ఆఫీసర్  మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కాంగ్రెస్ సపోర్ట్‌తో ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. లక్షా 96వేల321మంది పట్టభద్రులు, 23వేల 214మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇద్దరిమ ధ్యే పోటీ కనిపిస్తోంది. పీఆర్టీయూ నుంచి పూల రవీందర్‌ను టీఆర్ఎస్  బలపరుస్తోంది. యూటీఎఫ్ మద్దతుతో అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు