భిన్న'దమ్ములు'

22 Mar, 2019 08:35 IST|Sakshi
చెన్నమనేని విద్యాసాగర్‌రావు,చెన్నమనేని రాజేశ్వర్‌రావు , చెన్నమనేని హనుమంతరావు

అసెంబ్లీ వేదికగా భిన్నస్వరాలు..

ఒక కొమ్మకు పూసిన పువ్వులు...

అన్నదమ్ములు....రాజకీయాల్లో అసాధ్యులు..

చెన్నమనేని సోదరులు..

రెండు భిన్నమైన పార్టీలకు శాసనసభా పక్ష నేతలుగా వ్యవహరిస్తూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. వేర్వేరు పార్టీల తరుఫున ఇద్దరు అన్నదమ్ములు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, వారిద్దరూ శాసనసభలో రెండు పార్టీల పక్ష నేతలుగా వ్యవహరించడం ఎంతో అరుదు. అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు సోదరులు. విద్యాసాగర్‌రావు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. రాజేశ్వర్‌రావు మరణించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన చెన్నమనేని సోదరులు భిన్న ధృవాలుగా రాజకీయాల్లో తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

కమ్యూనిస్టు యోధుడిగా..
నిజాం వ్యతిరేకపోరాటంలో, తెలంగాణ విముక్తి ఉద్యమంలో రాజేశ్వర్‌రావు మడమ తిప్పని పోరాటాన్ని సాగించారు. తన భార్యతో కలిసి అజ్ఞాత జీవితం గడుపుతూ  ఉద్యమంలో సాయుధ పోరాటం సాగించారు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. భారతీయ కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)లో కీలకపాత్ర పోషిస్తూ చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో తొలిసారిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1967, 1978, 1985 ఎన్నికల్లో సిరిసిల్ల శాసనసభసభ్యుడిగా ఎన్నికై సీపీఐ శాసనసభపక్ష నాయకుడిగా మూడుసార్లు వరుసగా అసెంబ్లీలో తన వాణి వినిపించారు. 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజేశ్వర్‌రావు రైతు సంఘం జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా పని చేస్తూ అసెంబ్లీలో ఉన్నారు. ఆ సమయంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పువ్వాడ నాగేశ్వర్‌రావు సీపీఐ శాసనసభ పక్ష నేతగా కొనసాగారు. తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్‌ కమిటీ అధ్యక్షునిగా రాజేశ్వర్‌రావు పని చేశారు. 1999 ఎన్నికలకు ముందు సీపీఐకి రాజీనామా చేసి టీడీపీలో చేరి సిరిసిల్లలో పాపారావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన రాజేశ్వర్‌రావు వాగ్దాటిలో ఆయనకు ఆయనే సాటి. ఏదైనా అంశంపై శాసనసభలో రాజేశ్వర్‌రావు మాట్లాడుతున్నారంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తి చూపేవారు. అంతటి వాక్చాతుర్యం గల రాజేశ్వర్‌రావు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. ఆయన తనయుడు చెన్నమనేని రమేశ్‌బాబు వేములవాడ ఎమ్మెల్యేగా 2009, 2010, 2014లో వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. రాజేశ్వర్‌రావు 2016 మే 9న మరణించారు. రాజేశ్వర్‌రావు రాజకీయ వారసత్వాన్ని ఆయన తనయుడు రమేశ్‌బాబు వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో తొలి అడుగులు  
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్‌రావు రాజేశ్వర్‌రావుకు స్వయానా సోదరుడు. 1978లో తొలిసారి మంథని నియోజకవర్గం నుంచి విద్యాసాగర్‌రావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో విద్యాసాగర్‌రావు జనతాపార్టీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగారు. 1980లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపు ఓటములను సహజంగా భావించిన విద్యాసాగర్‌రావు 1985లో మెట్‌పల్లి నుంచి మిత్రపక్షమైన టీడీపీతో కలిసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేసి తొలివిజయాన్ని నమోదు చేసుకున్నారు. విద్యాసాగర్‌రావు అప్పటి నుంచి రాజకీయంగా మడమతిప్పకుండా ముందుకు సాగుతున్నారు. మెట్‌పల్లి నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1994లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఇదే సమయంలో చెన్నమనేని రాజేశ్వర్‌రావు సీపీఐ శాసన సభా పక్ష నేతగా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే సభలో రెండు పక్షాలకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. 1995లో కరీంనగర్‌ ఎంపీగా విజయం సాధించి 1999లో మరోసారి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో వేములవాడలో ఎమ్మెల్యేగా నిలిచిన విద్యాసాగర్‌రావు సోదరుడు రాజేశ్వర్‌రావు తనయుడు రమేశ్‌బాబు చేతిలో ఓడిపోయారు. బాబాయ్‌ని ఓడించిన అబ్బాయిగా రమేశ్‌బాబు నిలిచారు. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిన విద్యాసాగర్‌రావు రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలోపేతానికి కేంద్రమంత్రిగా కీలకపాత్రను పోషించారు. విద్యాసాగర్‌రావు ప్రస్తుతం మహరాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. కమ్యూనిస్టు నేతగా రాజేశ్వర్‌రావు, బీజేపీ నేతగా విద్యాసాగర్‌రావులు రాజకీయ చిత్రపటంలో తమదైన మార్క్‌ను చాటుకున్నారు.

ఆర్థిక రంగ నిపుణుడిగా..
రాజేశ్వర్‌రావు, విద్యాసాగర్‌రావుల సోదరుడు డాక్టర్‌ చెన్నమనేని హనుమంతరావు ప్రణాళిక సంఘం సభ్యుడిగా, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (సెంట్రల్‌ యూనివర్సిటీ) ఛాన్స్‌లర్‌గా పని చేశారు. హనుమంతరావు అత్యున్నతమైన పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. 2014లో రాజీవ్‌గాంధీ సద్భావన పురస్కారాన్ని పొందారు. హనుమంతరావు ఆర్థిక రంగ నిపుణులుగా పేరుపొందారు. మరో సోదరుడు చెన్నమనేని వెంకటేశ్వర్‌రావు సీపీఐ నేతగా కొనసాగుతున్నారు. గతంలో సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) డైరెక్టర్‌గా పని చేశారు. కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు రాజకీయాల్లో ఉండగా, ఒక్కరు ఆర్థికరంగ నిపుణులుగా పని చేస్తున్నారు. అన్నదమ్ములు నలుగురు తమదైన మార్గాల్లో కొనసాగడం విశేషం.
-వూరడి మల్లికార్జున్,సాక్షి సిరిసిల్ల

మరిన్ని వార్తలు