టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

12 Mar, 2018 01:24 IST|Sakshi
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సీఎం రమేశ్‌, రవీంద్ర కుమార్‌ (ఫైల్‌ ఫొటోలు)

సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్‌ను ఎంపిక చేసిన సీఎం

సాక్షి, అమరావతి: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరిద్దరూ సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తారని తెలిపారు. కాగా, ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేశ్‌ పదవీ కాలం ఈ నెలలో ముగియనుంది. సీఎం రమేశ్‌కు రెండోసారి అవకాశం ఇచ్చేందుకు మొదట్లో సుముఖత వ్యక్తం చేయకపోయినా.. చివరకు ఆయన పేరునే చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు రెండో అభ్యర్థిగా న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ పేరును హఠాత్తుగా తెరపైకి తీసుకొచ్చారు. రవీంద్ర గతంలో టీడీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడిగా.. బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన పేరు చివరి నిమిషంలో ఖరారైంది.  

ఎంపికలో హైడ్రామా..: అభ్యర్థుల ఎంపికపై రెండు రోజుల నుంచి చంద్రబాబు హైడ్రామా నడిపించారు. శనివారం ఆశావహులందరినీ కలిశారు. చివరకు సీఎం రమేశ్, వర్ల రామయ్య, బీద మస్తాన్‌రావుల్లో ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు లీకులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చెప్పి.. బీద మస్తాన్‌రావును ఆదివారం రేసు నుంచి తప్పించారు. దీంతో సీఎం రమేశ్, వర్లకు లైన్‌క్లియర్‌ అయ్యిందని అంతా భావించారు. అందుబాటులో ఉండాలని వీరిద్దరికీ పార్టీ కార్యాల యం నుంచి సమాచారం అందింది. కొద్దిసేపట్లో కళా వెంకట్రావు అభ్యర్థులిద్దరితో కలసి మీడియా సమావేశం నిర్వహిస్తారని మీడియాకు లీకులిచ్చారు. దీంతో వర్ల తనకు అవకాశమిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ పలు చానళ్లతో మాట్లాడారు.

కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే సీన్‌ రివర్స్‌ అయ్యింది. యనమల, కళా వెంకట్రావు సీఎం నివాసం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అభ్యర్థులపై చర్చ జరుగుతోందని.. సాయం త్రం అధికారిక ప్రకటన వెలువడనుందని కళా వెంకట్రావు మీడియా కు చెప్పి నిష్క్రమించారు. ఆ వెంటనే టీడీపీ కార్యాలయం నుంచి కళా వెంకట్రావు పేరుతో.. సీఎం రమేశ్, రవీంద్రకుమార్‌ను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ప్రకటన రావడం గమనార్హం. చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అభ్యర్థులను పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం అభ్యర్థుల ఎంపికపై ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.

మరిన్ని వార్తలు