అందుకే ఆ చానల్స్‌కు నోటీసులు : స్పీకర్‌

4 Aug, 2019 13:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో అద్బుతమైన బిల్లులపై చర్చ జరిగిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభా నిబంధనల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియమావళికి విరుద్ధంగా ప్రసారాలు నిర్వహించినందుకే ఆ మూడు చానల్స్‌కు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. రూల్స్‌ తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. నిద్రపోయేవారిని లేపవచ్చు కానీ.. నిద్రపోయినట్టు నటించే వాళ్లను ఏమి చేయలేమని వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని బిల్లులపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని బీఏసీలో చెప్పారు. బిల్లులపై పూర్తి స్థాయి చర్చ జరిగినప్పుడే అందులో ఏముందనేది అందరికీ అర్థమవుతుందనే సీఎం వైఎస్‌ జగన్‌ అభిప్రాయం. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు మరో మూడు నాలుగు రోజులు పొడిగిద్దామని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. నాపై ఎటువంటి ఒత్తిళ్లు లేవు. స్పీకర్‌పై తమవైపు నుంచి ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని సీఎం వైఎస్‌ జగన్‌ ముందే చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాను. పార్టీ విలీన వ్యవహారాల్లో నేను అసలు రాజీ పడను. చట్టం ప్రకారం అది నేరం.. నిబంధనలకు విరుద్ధంగా నేను నడుచుకోన’ని తెలిపారు. 

మరిన్ని వార్తలు