టికెట్ల లొల్లి.. కాంగ్రెస్‌కు మరో షాక్‌

13 Nov, 2018 18:18 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే నారాయణరావు

నెలన్నరపాటు ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితానైతే సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది కానీ ఈ జాబితానే కాంగ్రెస్‌ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నేతలు ఈ జాబితాతో నిట్టూర్చారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలేదని పలువురు కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నేతలు ఆందోళనకు దిగగా మరి కొంత మంది రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. గత 46 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తూ వస్తున్న తనను కాదని ఇటీవల పార్టీలో చేరిన రోహిత్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. 

పెరుగుతున్న నిరసనలు
జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో టికెట్లపై ఆశ పెట్టుకున్న నేతలు, వారి మద్దతుతారులు నిరసనలకు దిగారు. పలు నియోజకవర్గాల్లో పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కొత్తగూడెం స్థానాన్ని వనమా వెంకటేశ్వర్‌రావుకు కేటాయించడంతో ఆ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎడవల్లి కృష్ణ ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఎడవల్లి కృష్ణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. పాల్యంచలోని అంబేద్కర్‌సెంటర్‌లో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భద్రాచలం అసెంబ్లీ సీటును స్థానికేతరుడైన పోడెం వీరయ్యకు కేటాయించడం పట్ల వెంకటాపురం మండల కాంగ్రెస్‌ కమిటీ నిరసన తెలిపింది. భద్రాచలం సీటును స్థానికులకే కేటాయించాలని డిమాండ్‌ చేసింది.

జయశంకర్‌ భూపాలపల్లిని స్థానికులకే కేటాయించాలని కోరుతూ ఏఐసీసీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులకు స్థానిక కాంగ్రెస్‌ నేతలు వినతి పత్రాలు అందజేశారు. లేని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ సీటును సర్వే సత్యనారాయణకు కేటాయించడం పట్ల స్థానిక కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సీటును సర్వేకు కేటాయించడంతో టికెట్ ఆశించిన గణేష్‌ రెబల్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. టికెట్‌ దక్కకపోవడంతో పటేల్ రమేశ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.  

తొలిజాబితాలో పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు చోటు లభించకపోవడం ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలి జాబితాలోనే బీసీ నాయకుడిని పక్కన పెట్టడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తనకు ఎంపీ సీటు వద్దని ఎమ్మెల్యే సీటే కావాలని అదీ కూడా జనగామ నుంచే పోటీ చేస్తానని పట్టుపడుతున్నారు. జాబితాలో తన పేరు ప్రకటించనందుకు మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు