హామీల అమలు దిశగా..

21 Feb, 2019 02:16 IST|Sakshi

నేడు మంత్రివర్గ సమావేశం

బడ్జెట్‌కు ఆమోదం.. హామీలపై చర్చ

ఆసరా పింఛన్లు, రైతు బంధు పెంపు

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలుదిశగా సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ను రూపొందించారు. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా బడ్జెట్‌ రూపకల్పన పూర్తయింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కేసీఆర్‌ అసెంబ్లీలో తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ అయినా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిపే అవకాశం ఉందని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్థికశాఖ తన వద్దే ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత నాలుగేళ్లలాగే ఈసారీ భారీ బడ్జెట్‌కు రూపకల్పన జరిగింది. కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానున్న కేబినెట్‌ తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. తాత్కాలిక బడ్జెట్‌ అయినా 12 నెలలకు అవసరమైన అంచనాలను బడ్జెట్‌లో పొందుపరిచినట్లు తెలిసింది.

సంక్షేమానికి భారీగా...
‘ఆదాయం పెంచాలి. సంక్షేమం పంచాలి’నినాదంతో సంక్షేమ రంగానికి ఈసారీ భారీగా కేటాయింపులు జరపనుంది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గతంలో కంటే ఈసారి కేటాయింపులు పెంచనుంది. ఆసరా పింఛన్లలో కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ నుంచి పెరిగిన పింఛన్‌ను చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ఆసరా పథకానికి కేటాయింపులు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో ఆసరా పింఛన్‌ లబ్ధిదారులు 40లక్షల మంది ఉన్నారు. వయస్సు పరిమితి తగ్గించడం, పెన్షన్‌ మొత్తాన్ని రెట్టింపు చేస్తుండడంతో కేటాయింపులు సైతం రెట్టింపు కానున్నాయి. కొత్తగా 7లక్షల మందికి పింఛను చెల్లించాలని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఆసరా పథకానికి అత్యధిక మొత్తంలో నిధుల కేటాయింపులు ఉండనున్నాయి. నిరుద్యోగభృతి, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం పథకంలో మార్పులు, ఎస్సీ–ఎస్టీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌లో వీటిని ప్రస్తావించడంతోపాటు అవసరమైన నిధుల కేటాయింపులు ఉండనున్నాయి.

మరిన్ని వార్తలు