సింగరేణి మనుగడ కేసీఆర్‌తోనే..

20 Nov, 2023 05:21 IST|Sakshi
భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోకు హాజరైన ప్రజలు. ఇన్‌సెట్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

సంస్థను ఖతం చేసే పనిలో ప్రధాని మోదీ

కార్మికుల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్‌

గిరిజనేతరులకూ పోడు పట్టాలు ఇస్తాం

భద్రాద్రి జిల్లా పర్యటనలో కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్‌ ఉండాలి..కేసీఆర్‌ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి అని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలో ఆదివారం ఆయన రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ సింగరేణి ప్రైవేటీకరణకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంటికి అందకుండా సింగరేణిని మింగేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ ఎంపీలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్‌ ఎంపీ కూడా పార్లమెంట్‌లో నోరుమెదపలేదని విమర్శించారు. 

త్వరలోనే ‘సీతారామ’పూర్తి చేస్తాం
సీతారామ ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌కు సరైన ఆదరణ లేదని, కానీ ఈసారి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు, అలకలు ఉంటే అన్నీ పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. గిరిజనేతరులకు పోడు పట్టాల పంపిణీ తదితర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు.

దరిద్రానికి నేస్తం ‘హస్తం’
కాంగ్రెస్‌ వారు ఒక్క అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని, ప్రజలు ఇప్పటికే 11 సార్లు అవకాశం ఇచ్చారని, ఇంకెన్నిసార్లు ఇవ్వాలని కేటీఆర్‌ ఎద్దేశా చేశారు. రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, రాష్ట్రంలో ఎంత మంది రైతులకు 10 హెచ్‌పీ మోటార్లు ఉన్నాయని ప్రశ్నించారు. దరిద్రానికి నేస్తంగా హస్తం మారిందని ఆయన ఆరోపించారు. 

నా పేరే తారక రామారావు: మూడోసారి అధికా రం చేపట్టగానే యాదాద్రి కంటే మిన్నగా భద్రా చలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తా మని హామీ ఇచ్చారు. కేటీఆర్‌ మధ్యాహ్నం భద్రా చలం చేరుకునేసరికి అప్పటికే ఆలయం తలుపులు మూసేయగా దర్శనం సాధ్యం కాలేదు. దీనిపై కేటీఆర్‌ వివరణ ఇస్తూ ‘నా పేరే తారక రామారా వు’నాకు రాముడిపై భక్తి లేకుండా ఎలా ఉంటుంది’అని కేటీఆర్‌ అన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బానోత్‌ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు