సిట్టింగ్‌లకు గండం

25 Sep, 2018 14:04 IST|Sakshi

అధికార పార్టీ సిట్టింగ్‌ల్లో కలవరం 

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి

నాలుగు నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతల హల్‌చల్‌

టికెట్‌ మాదేనంటూ ఎవరికి వారే ప్రచారం

మారుతున్న నియోజకవర్గ సమీకరణాలు

తెరపైకి కుల రాజకీయాలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అధిష్టానం ఇస్తున్న సంకేతాలతో జిల్లాలోని ఆ పార్టీ నేతల్లో టికెట్ల గండం కలవరపెడుతోంది. ముఖ్యంగా  సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పరిస్థితిపై అధిష్టానం వద్ద చిట్టా ఉంది. పార్టీ కేడర్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవటంతో తమ స్థానాలు గల్లంతు కావడం ఖాయంగా భావిస్తున్న సిట్టింగ్‌లు లాబీయింగ్‌లకు దిగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులు తమ గాడ్‌ఫాదర్ల ద్వారా బలమైన లాబీయింగ్‌తో కుల సమీకరణాలకు తెరతీశారు. ఈ పరిణామాలతో అధికార పార్టీలో టికెట్ల గందరగోళం నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో వెంకటగిరి, ఉదయగిరి, కోవూరు, గూడూరు పార్టీ కేడర్‌లో కొత్త చర్చ మొదలయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పది స్థానాలకు ఉదయగిరి, వెంకటగిరి, కోవూరులో మాత్రమే టీడీపీ గెలుపొందింది.

మిగిలిన ఏడు స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తదనంతరం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో నియోజకవర్గాల వారీగా స్థానాలపై తీవ్ర చర్చ అధికార పార్టీలో జరుగుతోంది. ముఖ్యంగా అందరి దృష్టి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలపైనే ఉంది. రానున్న ఎన్నికల్లో ఎవరికి మళ్లీ టికెట్‌ దక్కుతుంది.. ఎవరికి గల్లంతు అవుతుందనే దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రజలకు ఎలాగూ ఏమీ చేయలేదు, కనీసం పార్టీ క్యాడర్‌ అయినా ఏం చేశారనే దానిపై అంతర్మథనం పడుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు తరచూ నిర్వహించే సమావేశాల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలకు క్లాస్‌ తీసుకోవటం, అందరూ కలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్పటం, సర్వేల్లో మీ పనితీరు బాగుంటేనే టికెట్‌ ఇస్తానని ప్రకటించటంతో సిట్టింగ్‌ల్లో గుబులు ప్రారంభమైంది.

వెంకటగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు
 ముఖ్యంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తీరుపై ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వివాదాస్పద వైఖరి, లెక్కకు మించిన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ప్రతి సందర్భంలోనూ వెంకటగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారదను అవమానిస్తూ ఆమె సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి తారా స్థాయికి  చేరింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కించుకోవటానికి కొందరు ఆశావహులు తెరపైకి వచ్చారు. పనిలో పనిగా జిల్లా మంత్రులు, ముఖ్యుల సహకారంతో బలంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో చేసిన కాంట్రాక్ట్‌ పనులకు సంబంధించి మహారాష్ట్ర ఏసీబీలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల రేణిగుంట విమానాశ్రయంలో వివాదం, స్థానికంగా నేతలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

వీటిపై గతంలో చంద్రబాబునాయుడు కూడా నియోజకవర్గంలో ఎక్కువగా అందుబాటులో ఉండాలని బొల్లినేనికి హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్‌ దక్కదనే యోచనతో ఆశావహులు బలంగా ప్రయత్నాలు మొదలు పెట్టడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపైనా పార్టీ క్యాడర్‌లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి వచ్చి టీడీపీలో గెలపొంది, పాత టీడీపీ క్యాడర్‌ను పూర్తిగా పక్కన పెడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి 60 మంది నేతలతో నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి టికెట్‌ కోసం ఇద్దరు ఆశావహులు బలమైన లాబీయింగ్‌కు తెర తీసినట్లు సమాచారం. ఇక పోతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ది ఇదే పరిస్థితి. టీడీపీలో చేరిన తర్వాత అవినీతి ఆరోపణలు రావటం, దూకుడు వ్యవహార శైలితో తరచూ వివాదాస్పద వ్యక్తిగా మారారు.  అక్కడ పాత టీడీపీ నేతల నుంచి నిత్యం తలనొప్పులు అధికంగా వస్తున్నాయి. గూడూరు స్థానాన్ని ఆశిస్తూ కొందరు టీడీపీ నేతలు, మరికొందరు ఆశావహులు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద సిట్టింగ్‌లకు టికెట్‌ గండం పార్టీలో నేతల్ని కలవర పెడుతుంది.   

మరిన్ని వార్తలు