చంద్రబాబు అమెరికాలో పుట్టి ఉంటే దరిద్రం పోయేది!

25 Sep, 2018 14:00 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు, తోటపల్లిగూడూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికాలో పుట్టి ఉంటే తెలుగు ప్రజల దరిద్రం పోయేదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో సోమవారం నరుకూరు సెంటర్‌లోని రిషీ కల్యాణ మండపంలో మండల బూత్‌కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాల్సినవాడని కాదని అమెరికాలో పుట్టాల్సిన వ్యక్తినని పదేపదే చెప్పుకునే చంద్రబాబు నిజంగా అక్కడే పుట్టి ఉంటే ఆంధ్రులకు దరిద్రం వదిలిపోయేదన్నారు. అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో  చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రుణమాఫీ దగ్గర నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర హామీలను నెరవేర్చలేకపోయారన్నారు.

రాజ్యంగ విరుద్ధంగా జన్మభూమి కమిటీలను పెట్టి ప్రభుత్వ పథకాలను టీడీపీ కార్యకర్తలకు, పచ్చకండువా కప్పుకున్న వారికే దారాదత్తం చేసి అర్హులకు మొండి చేయి చూపించారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సాగిస్తున్న అరాచకపాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో, సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నానని యాష్‌ పాండయన్‌గా పేరు తెచ్చుకొన్న రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజా రంజక పాలన సాగించిన ఘనత రాష్ట్ర చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రజల ముందుకు వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత బూత్‌కమిటీ సభ్యులపై ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకుల మధ్య ఎమ్మెల్యే కేక్‌ను కట్‌ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, కోడూరు దిలీప్‌రెడ్డి, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఈదూరు రామాచార్యులు, పార్టీ మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవుల గౌడ్, ఎంపీపీ నాయుడు గిరిజమ్మ, వైస్‌ ఎంపీపీ చెరుకూరు సరళకుమారి, నియోజకవర్గ బూత్‌ కమిటీ కన్వీనర్‌ మందా వెంకటశేషయ్య, మండల బూత్‌ కమిటీ కన్వీనర్‌ తలమంచి సురేంద్రబాబు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు