సీబీఐ అంటే వారికి భయం

18 Nov, 2018 04:31 IST|Sakshi
అరుణ్‌ జైట్లీ

ఏపీ, బెంగాల్‌ ప్రభుత్వాలపై అరుణ్‌ జైట్లీ వ్యాఖ్య

నోట్ల రద్దు నైతికతకు సంబంధించిందన్న మంత్రి

మధ్యప్రదేశ్‌ బీజేపీ మేనిఫెస్టో విడుదల

భోపాల్‌: బయటకు వెల్లడించలేని రహస్యాలు చాలా ఉన్న వారే సీబీఐ అంటే భయపడతారని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాల్లో సోదాలు, దర్యాప్తులు చేపట్టకుండా ఏపీ, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు సీబీఐకిచ్చిన సాధారణ అనుమతిని వెనక్కి తీసుకోవడంపై ఆయన పైవిధంగా స్పందించారు. అలాగే, తమ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు రాజకీయ చర్య కాదు, నైతికతకు సంబంధించినదని సమర్థించుకున్నారు. ఈ నెల 28వ తేదీన మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలకుగాను శనివారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘వెల్లడించకూడని ఎన్నో రహస్యాలు ఉన్న వారే తమ రాష్ట్రాలకు సీబీఐ రావద్దంటారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలానా కేసుకు సంబంధించి అని చెప్పలేను. భవిష్యత్‌లో అలాంటి అవకాశం ఉందనే భయంతో తీసుకున్న చర్య అది’ అని అన్నారు. ‘మన సమాఖ్య వ్యవస్థలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలతోపాటు, రాష్ట్రాలు, కోర్టులు అప్పగించిన కొన్ని తీవ్రమైన కేసులను సీబీఐ విచారిస్తుంది. సీబీఐని అడ్డుకున్నంత మాత్రాన పశ్చిమబెంగాల్‌లో నర్మద, శారదా చిట్‌ ఫండ్‌ స్కాంలపై దర్యాప్తు ముగిసినట్లేనని చెప్పలేను’ అని అన్నారు. వివాదాస్పద నోట్ల రద్దును సమర్థించిన అరుణ్‌ జైట్లీ ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు ‘అత్యంత నైతికమైన’ చర్యగా పేర్కొన్నారు.

ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు
ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ వంటి అంశాలతో శనివారం మధ్యప్రదేశ్‌ బీజేపీ మేనిఫెస్టో ‘సమృద్ధ మధ్యప్రదేశ్‌ దృష్టి పత్ర’తో పాటు మహిళలకు ప్రత్యేకంగా ‘నారీ శక్తి సంకల్ప పత్ర’ ను విడుదల చేసింది. రైతులకు రూ.40వేల కోట్ల రుణాల పంపిణీ, వచ్చే ఐదేళ్లలో 80 లక్షల హెక్టార్ల భూమిని సాగు యోగ్యం చేయడం, ఆహార శుద్ధి పరిశ్రమకు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. అందరికీ పని కల్పించడంతోపాటు ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేర్కొంది. మహిళల కోసం.. పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్ల తయారీ మిషన్ల ఏర్పాటు, 12వ తరగతి పరీక్షల్లో 75శాతం మార్కులు సాధించే వారికి స్కూటీల పంపిణీవంటివి ఉన్నాయి.

మరిన్ని వార్తలు