-

రాష్ట్రాన్ని దోచుకుంటూ విమర్శలా?

29 Apr, 2018 01:39 IST|Sakshi
టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

కేసీఆర్‌పై విరుచుకుపడ్డ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

ప్రగతి భవన్‌ నిండా ఆంధ్రా కాంట్రాక్టర్లే 

అక్కడ సామాన్యులు కనిపించరు.. 

నీలా క్యారెక్టర్‌ లేని పనులు చేయలేదు.. సైన్యంలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చా 

టీఆర్‌ఎస్‌ వల్ల నాకు పీసీసీ రాలేదు..

కాంగ్రెస్‌ వల్లే నీకు సీఎం పదవి 

దేశ రాజకీయాల్లో కాదు..

ఉస్మానియాలో కాలు పెట్టు చాలు: షబ్బీర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబం మొత్తం రాష్ట్రంపై పడి అడ్డగోలుగా దోచుకుంటూ ఇతరులపై నిందలు వేసే ప్రయత్నం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సీఎం మాట లు అడ్డగోలుగా, చిల్లరగా ఉన్నాయని, ఆయన హుందాకు తగిన విధంగా లేవని అన్నారు. ప్రతిపక్షాలపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం గాంధీ భవన్‌లో మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 

‘రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రాజనీతిజ్ఞుడిగా ఉంటారని భావించాం. కానీ ఇతరులను పదే పదే కించపరుస్తూ తన వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు. గల్లీ స్థాయి లీడర్‌గా చిల్లరగా మాట్లాడుతున్నారు’అని విరుచుకుపడ్డారు. ‘రాజకీయాల్లోకి రాక ముందు సైన్యంలో పని చేశా. యుద్ధ విమానాల పైలట్‌గా దేశ రక్షణ కోసం సరిహద్దులో ఏళ్లపాటు సేవలందించా. నిస్వార్థంగా పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. నేనూ, నా భార్య ప్రజాజీవితానికే అంకితమయ్యాం. మాకు పిల్లలు లేరు. వారసత్వం లేదు. కేసీఆర్‌లా క్యారెక్టర్‌ లేని పనులు చేసి రాజకీయాల్లోకి రాలేదు. పిచ్చి, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు’ అని ఉత్తమ్‌ హితవు పలికారు. 

ప్రధానికి కూడా అలాంటి నివాసం లేదు.. 
టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్‌ చేసిన విమర్శలపై ఉత్తమ్‌ తీవ్రంగా స్పందించారు. ‘ప్రగతి భవన్‌లో 150 గదులు ఉన్నాయని నేనెప్పుడూ అనలేదు. కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీఎం అధికారిక నివాసం ఉన్నా.. రూ.500 కోట్ల విలువైన స్థలంలో ప్రగతి భవన్‌ నిర్మించారు. దాని నిర్మాణానికి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేశారు. ప్రగతి భవన్‌ నిర్మాణ ఖర్చు ప్రజాధనం కాదా? వందల కోట్లతో ఎవడబ్బ సొమ్మని ప్రగతి భవన్‌ కట్టుకున్నావ్‌’అని ప్రశ్నించారు. ‘దేశ ప్రధానికి కూడా ఇంత విలాసవంతమైన నివాసం లేదు. ప్రైవేటు కార్యక్రమాలకూ ప్రత్యేక విమానాలు వినియోగిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు విదేశాల్లో అత్యంత ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు’అని ఆరోపించారు. ప్రగతి భవన్‌లో సామాన్య ప్రజలెవరూ కనపడరని, కేవలం ఆంధ్రా కాంట్రా క్టర్లు మాత్రమే కనబడతారని విమర్శించారు. 

ప్రజలకు మాత్రం పైసలుండవు.. 
‘నేనెప్పుడూ ఆంధ్రా నేతల సంచులు మోయ లేదు. తెలంగాణ ముసుగులో రాష్ట్ర సొమ్మును ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నది మీరు’అని సీఎంపై ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. ‘చనిపోయిన రైతులకు, అమరవీరులకు ఇవ్వడానికి పైసలు ఉండవు. సబ్సిడీ ఇవ్వడానికి, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు భూమి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులుండవు. కానీ విలాసాలకు కోట్లు ఖర్చు చేస్తారా?’అని ప్రశ్నించారు. ‘ముస్లిం రిజర్వేషన్ల అమలుపై ప్లీనరీలో మాట్లాడరు. గిరిజనుల రిజర్వేషన్లు ఏమయ్యాయో చెప్పరు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఏమైందో తెలియదు. ఉద్యోగ ఖాళీలు నింపలేని అసమర్థుడివి. ప్రతిపక్షాలపై అవమానకరంగా మాట్లాడటం తెలుసు. హామీలు నెరవేర్చనందుకు ప్రజలకు ఇప్పటికై నా క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్‌ చేశారు. 

దొంగ పాస్‌పోర్ట్‌ల చరిత్ర నీది: షబ్బీర్‌ 
కాంగ్రెస్‌ పార్టీ మీద విమర్శలు చేసే ముందు కేసీఆర్‌ తన జీవితం ఏమిటో వెనక్కి తిరిగి చూసుకోవాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ సూచించారు. దొంగ పాస్‌పోర్ట్‌ల చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టించడం కాదని, దమ్మూ ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టాలని సవాల్‌ విసిరారు. క్యాంపస్‌లోకే పోలేని వ్యక్తి దేశాన్ని నడుపుతారా? అని ఎద్దేవా చేశారు. దేశం కోసం సైన్యంలో పనిచేసిన వ్యక్తిపై వ్యక్తిగత విమర్శలు సరికాదని హితవుపలికారు.  

ఒక్క ఎంపీ సీటు కూడా రాదు
టీఆర్‌ఎస్‌ వల్లే పీసీసీ పదవి వచ్చిం దంటూ తనపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్‌ మండిపడ్డారు. ‘నీ  వల్ల పీసీసీ రాలేదు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వడం వల్ల నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే మా సంగతి కాదు.. ముందు మీ సంగతి ఎలా ఉండేదో ఆలోచించండి’అని హితవు పలికారు. దేశానికి జాతీయ పార్టీలు ఏమీ చేయలేదట కానీ, కేసీఆర్‌ ఓ తీస్మార్‌ ఖాన్‌లా ఏదో చేస్తారా అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని, ఇక ఆయన జాతీయ రాజకీయాలు ఏం చేస్తారని ప్రశ్నించారు. భారత్‌ను చైనాతో పోల్చడాన్ని తప్పుబట్టిన ఉత్తమ్‌.. అసలు చైనాలో ప్రజాస్వామ్యం ఉందా? అని నిలదీశారు. 

మరిన్ని వార్తలు