-

Rajasthan Elections 2023: రిజర్వ్‌డ్‌ స్థానాల్లో గెలిస్తేనే..‘రాజ’స్థానం

27 Nov, 2023 19:28 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 200 నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏ పార్టీకీ రెండోసారి అధికారం ఇచ్చే అలవాటు లేని రాజస్థానీయులు ఈసారి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

రాజస్థాన్‌లో 1998 నుంచి ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30 శాతం రిజర్వ్‌డ్‌ సీట్లు ఉన్నాయి. మొత్తం 59 రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో 34 ఎస్సీ స్థానాలు కాగా, 25 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎ‍క్కువ స్థానాలు గెలుచుకున్నపార్టీనే అధికార పీఠం అధిరోహిస్తోంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికలలో రెండింటిలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్య ఉన్న గెలుపు తేడా మొత్తం ఈ రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్యలో సగం కూడా లేదు. 2008 డీలిమిటేషన్ తర్వాత లోక్‌సభ ఎన్నికలతో సహా రాజస్థాన్‌లో ఆరు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు ఎన్నికలలో అత్యధిక రిజర్వు స్థానాలను గెలుపొందిన పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించినట్లు  చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. 

బీజేపీదే ఆధిక్యం
రాజస్థాన్‌లో 2013 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ సహా మూడు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక రిజర్వ్‌డ్‌ స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది. కాంగ్రెస్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఎక్కువ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో గెలుపొందింది. 2013 అసెంబ్లీ ఎన్నికలు, 2014 లోక్‌సభ ఎన్నికల్లో అయితే ఒక్క ఎస్సీ రిజర్వ్‌డ్ సీటును కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. మొత్తం 34 ఎస్సీ స్థానాల్లో బీజేపీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలు గెలుచుకోగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 33 స్థానాల్లో అత్యధిక ఓట్లు సాధించింది. ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 34 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో 32, 25 ఎస్టీ సీట్లలో 19 చోట్ల బీజేపీదే ఆధిపత్యం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం ఒక ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో, ఐదు ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో అగ్రస్థానంలో నిలిచింది.

2018లో కాంగ్రెస్‌ జోరు 
రాజస్థాన్‌లో జరిగిన గత నాలుగు ఎన్నికలలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ దూసుకెళ్లింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ రిజర్వ్‌డ్ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకోగలిగినప్పటికీ, దాని విజయం ఇంతకుముందు మూడు ఎన్నికలలో బీజేపీ సాధించినంత ప్రబలంగా లేదు. 2018లో కాంగ్రెస్ 19 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు, 12 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి 12 ఎస్సీ స్థానాలు, 9 ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీట్లు దక్కాయి. అయితే ఈ ఆధిక్యాన్ని కాంగ్రెస్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి రిజర్వ్‌డ్‌ సీట్లలో ఆధిక్యం దక్కుతుందన్నది డిసెంబర్‌ 3న జరిగే ఓట్ల లెక్కింపులో తెలియనుంది.

మరిన్ని వార్తలు