బీజేపీ బీ టీమ్‌గా టీఆర్‌ఎస్‌

21 Dec, 2019 09:38 IST|Sakshi

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై కేసీఆర్‌ మౌనం ఎందుకు..?

కేంద్రం, రాష్ట్రం రెండూ ఒక్కటే..

సాక్షి, నిర్మల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బీ–టీమ్‌గా మారిందని ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ ఆరోపించారు. నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని డీసీసీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధి కార్యకర్తలతో మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ దేశంలో సెక్యులరిజాన్ని మంటగలుపుతూ మోదీ, అమిత్‌షా మతాలు, కులాల వారీగా విభజిస్తున్నారని మండిపడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ సూచించిన హిందూత్వ ఎజెండాను అమలు పరుస్తున్నారని ఆరోపించారు. ఇందులోభాగంగానే కశ్మీర్‌లో 370ఆర్టికల్, పౌరసత్వ సవరణ చట్టం, తర్వాత ఎన్‌ఆర్‌సీలను తీసుకువస్తోందన్నారు. ఓవైపు జీడీపీ 9శాతం నుంచి 2శాతానికి పడిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం, వ్యాపార రంగ క్షీణత వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కోటి ఉద్యోగాలను ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందని ప్రశ్నించారు.

దేశంలో దిగజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. చివరకు జపాన్‌ ప్రధాని సైతం తన పర్యటనను వాయిదా వేసుకున్నారని చెప్పారు. బడిలో కిండర్‌గార్టెన్‌ చదివే పిల్లలు సైతం మతాల గురించి మాట్లాడుకునే దుస్థితికి భారత సంస్కృతిని దిగజార్చారని ఆరోపించారు. 

కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు..
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ఆందోళనలు కొనసాగుతున్నాయని కృష్ణన్‌ పేర్కొన్నారు. కేరళ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను అమలు చేయబోమని చెబుతున్నా.. సీఎం కేసీఆర్‌ మాత్రం మౌనం వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ తుంగలో తొక్కారని ఆరోపించారు. డబుల్‌బెడ్రూం, నిరుద్యోగ భృతి తదితర పథకాలు ఇప్పటికీ ప్రజలకు అందడం లేదన్నారు. పీఎం, సీఎం ఇద్దరూ ప్రజలను మభ్య పెడుతూ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.

త్వరలోనే భారత్‌ బచావో.. తెలంగాణ బచావో పేరిట ఆందోళనలను చేపడతామని శ్రీనివాసన్‌ కృష్ణన్‌ వెల్లడించారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. డీసీసీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సర్కారు వైఫల్యాలను తీసుకెళ్తామన్నారు.

అనంతరం కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రామారావుపటేల్,  మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్, ఉట్నూరు, దిలావర్‌పూర్‌ జెడ్పీటీసీలు చారులత రాథోడ్, తక్కల రమణారెడ్డి, ఆదిలాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు భార్గవ్‌ దేశ్‌పాండే, గండ్రత్‌ సుజాత, పాల్వాయి హరీశ్‌రావు, సత్యం చంద్రకాంత్, అజర్, ముత్యంరెడ్డి తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు