పగలు రాత్రి రేవ్‌ పార్టీలు

21 Dec, 2019 09:45 IST|Sakshi
నందికొండ సమీపంలో జరుగుతున్న పార్టీ

మత్తులో తూలుతున్న యువత

పరిసరాల్లో ప్రశాంతత కరువు

నందికొండను కాపాడండి : టీపీ సభ్యుడు సునీల్‌

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : నందికొండ చుట్టుపక్కల పరిసరాల్లోన్న హుక్కాబార్‌లు, రిసార్ట్‌లు, ఫాంహౌస్‌లలో జరుగుతున్న రేవ్‌ పార్టీలు, మత్తు పార్టీలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పగలు రాత్రి ప్రశాంతత కరువయిందని తాలూకా పంచాయతీ సభ్యుడు, జిల్లా జేడీఎస్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ ఆరోపించారు. శుక్రవారం దొడ్డ పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా విదేశీయులు సైతం ఈ పార్టీలలో హాజరవుతున్నారన్నారు. రేవ్‌ పార్టీల పేరుతో మత్తు పదార్థాలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారన్నారు. చీకటి పడిందంటే పెద్దపెద్ద శబ్దాలతో డీజే సౌండ్‌తో పార్టీలు ప్రారంభమవుతాయన్నారు.

దేశ, విదేశాల యువతులు గుంపులుగా వస్తున్నారని, దీంతో లోపల ఏం జరుగుతోందో ఊహించవచ్చన్నారు. నందికొండ చుట్టుపక్కల,  ఘాటిసుబ్రమణ్య పుణ్యక్షేత్రం పరిసరాల్లోనూ రిసార్ట్‌లలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పోలీసులు అన్నీ తెలిసీ మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మత్తు పదార్థాల వ్యర్థాలు, మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున చెరువుల్లో ప్రత్యక్షమవుతున్నాయని, దీంతో చెరువులు కూడా కలుషితమవుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు ప్రదర్శించారు. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఇప్పటి నుండే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పోలీసులు ఇప్పటికయినా మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

మరిన్ని వార్తలు