రూ.150 కోట్లు  కాంట్రాక్టర్‌  జేబులోకి!

21 Sep, 2019 04:13 IST|Sakshi

ఆర్టీసీలో బ్యాటరీ బస్సుల అద్దె బాగోతం

ఒక్కో బస్సుపై రూ.50 లక్షల డిస్కౌంట్‌

కొనకుండా, అద్దె రూపంలో తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయం

కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక లబ్ధి ప్రైవేటు సంస్థకు..

పండుగలొస్తే చాలు తయారీదారులు ఉత్పత్తులపై డిస్కౌంట్లు ప్రకటిస్తారు. ప్రజలు కూడా జేబుపై భారం పడకుండా డిస్కౌంట్ల కోసం ఎదురుచూసి వాటిని కొనుగోలు చేస్తుంటారు. చిన్నచిన్న వస్తువుల విషయంలో కూడా సగటు వినియోగదారుడు అలాగే ఆలోచిస్తాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు ఈ ఆఫర్ల కోసం మరింతగా తపిస్తాడు. అలాంటప్పుడు తీవ్ర నష్టాలు, పెరుగుతున్న ఖర్చులు, అంతంత మాత్రంగానే రాబడి ఉండి.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ ఏం చేస్తోందో తెలుసా? కేంద్రం ప్రకటించిన రూ.150 కోట్ల రాయితీని కాలదన్నుకుంటోంది. ఆ లబ్ధిని కాంట్రాక్టర్‌ చేతిలో పెట్టబోతోంది. బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో, కొత్త బస్సులపై కేంద్రం ప్రకటించిన ఓ అవకాశాన్ని దారి మళ్లించి ప్రైవేటు పరం చేస్తోంది. ఇప్పుడు కొంటే రూ.కోటిన్నర బస్సు రూ.కోటికే అందుతుంది. తర్వాత కొంటే పూర్తి మొత్తం చెల్లించాల్సిందే.    – సాక్షి, హైదరాబాద్‌

ఇదీ సంగతి..
కాలుష్యానికి విరుగుడుగా భావించే బ్యాటరీ బస్సులను ప్రోత్సహించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌) పథకం ప్రారంభించింది. ఈ పథకం మలి దశలో తెలంగాణకు 325 బస్సులు మంజూరైన సంగతి తెలిసిందే. ఇవన్నీ నాన్‌ ఏసీ బ్యాటరీ బస్సులు. తొలి దశలో 40 ఏసీ బస్సులు సమకూర్చుకుని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి నడుపుతున్నారు. 336 బస్సులు కావాలని ప్రతిపాదించగా, కేంద్రం 325 బస్సులకు ఆమోదం తెలిపింది. వీటిల్లో 300 బస్సులను హైదరాబాద్‌లో సిటీ బస్సులుగా, మిగతా వాటిని వరంగల్‌లో సిటీ బస్సులుగా నడపాలని ప్రాథమికంగా ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం కొత్తగా సమకూరే బస్సులు 12 మీటర్ల పొడవుండేవి. వీటి ధర దాదాపు రూ.కోటిన్నర. సంవత్సర కాలంలో 5 వేల బస్సులు అందించాలని నిర్ణయించి, ఆర్టీసీలకు భారం కాకుండా ధరలో రాయితీ ప్రకటించింది. 12 మీటర్ల నాన్‌ ఏసీ బస్సు ధరలో గరిష్టంగా రూ.50 లక్షల రాయితీ ప్రకటించింది. అంటే రూ.కోటిన్నర విలువైన బస్సు దాదాపు రూ.కోటికే అందే అవకాశం ఉంటుంది. 325 బస్సులకు దాదాపు రూ.162 కోట్ల వరకు అవుతుంది. నిబంధనల ప్రభావం పోను కనిష్టంగా రూ.150 కోట్ల లబ్ధి చేకూరుతుంది.

రంగంలోకి నేతలు?
కానీ ఈ బస్సులను నేరుగా కొనేందుకు ఆర్టీసీ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఇంతపెద్ద మొత్తం చెల్లించి బస్సులు కొనే స్థోమత లేదన్న కారణంతో ఆ బస్సులను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవాలని నిర్ణయించింది. అంటే.. కాంట్రాక్టు పొందిన సంస్థ ఆ బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిస్తుంది. వాటిని వాడుకున్నందుకు కిలోమీటరుకు నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ తిరిగి ఆ కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తుంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు కొందరు రాజకీయ నేతలు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం.

జీతాల భయంతో..
ఆర్థిక ఇబ్బందులున్న తరుణంలో ఇంతపెద్ద మొత్తం ఆర్టీసీకి బాగా కలిసొచ్చేదే. బ్యాంకు రుణం తీసుకుని ఆ బస్సులు సమకూర్చుకుంటే రాయితీ, లాభం బాగా ఉపయోగపడేదే. కానీ అందుకు ఆర్టీసీ సాహసించట్లేదు. మరోవైపు సొంతంగా ఆ బస్సులు నిర్వహిస్తే వాటికి డ్రైవర్లు, కండక్టర్లను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ రూపంలో వారికి జీతాల చెల్లింపు పెద్ద భారంగా మారుతుందని ఆర్టీసీ భయపడుతోంది. ప్రస్తుతం కొత్త బస్సుల కొనుగోలు, ఇతర ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వకపోతుండటంతో ఆర్టీసీ చేతులెత్తేస్తోంది. రెండు రోజుల కింద టెండరు నోటీసు విడుదల చేసింది. 

ప్రైవేటు సంస్థకెందుకు
బ్యాటరీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ సొంతంగా తీసుకుని కేంద్రం ఇచ్చే రాయితీ లబ్ధి పొందాలి. అప్పనంగా ప్రైవేటు సంస్థకు ఒక్కో బస్సుపై రూ.50 లక్షలు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం. 
– నాగేశ్వర్‌రావు, ఎన్‌ఎంయూ

టెండర్లను అడ్డుకుంటాం
కేంద్రం ఇచ్చే రాయితీ కష్టకాలంలో ఆర్టీసీకి ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని కాలదన్నుకుని ప్రైవేటు సంస్థకు కట్టబెడతామంటే చూస్తూ ఊరుకోం. అద్దె ప్రాతిపదికన తీసుకోవటం వల్ల డ్రైవరు, కండక్టరు, శ్రామిక్‌ పోస్టులను కూడా ఆర్టీసీ కోల్పోతుంది. నిర్ణయం మార్చుకోకుంటే టెండర్లను అడ్డుకుంటాం. 
– రాజిరెడ్డి, ఏయూ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా