హామీలను నిజాయితీగా ఇద్దాం

7 Mar, 2019 03:59 IST|Sakshi
మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి చిత్రంలో పార్టీ నేతలు

అన్ని వర్గాల సంక్షేమం ప్రతిబింబించేలా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో

క్లుప్తంగా.. అందరికీ అర్ధమయ్యేలా రూపకల్పన 

మేనిఫెస్టో కమిటీకి దిశానిర్దేశం చేసిన వైఎస్‌ జగన్‌

సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించిన ఉమ్మారెడ్డి

‘నవరత్నాల’కు మరింత మెరుగులు దిద్దుతాం

‘పాదయాత్ర’ హామీలకూ చోటు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి: ‘మన పార్టీ తరపున ప్రకటించబోయే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పర్చే అన్ని హామీలను నిజాయితీగా ఇద్దామని, రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపొందిద్దాం’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. వాగ్దానాల విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ పోటీ లేదని, ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచనతోనే ముందుకెళదామని జగన్‌ అన్నారు. మేనిఫెస్టోను రూపొందించేటప్పటపుడు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాను ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ చేసిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

మేనిఫెస్టో సంక్షిప్తంగా అందరికీ అర్థం అయ్యేలా ఉండాలన్నారు. కౌలు రైతులకు న్యాయం చేసేలా మన పథకాలు ఉండాలని కూడా ఆయన కమిటీ సభ్యులతో అన్నారు. చేసిన ప్రతి వాగ్దానాన్ని నిజాయితీతో నూటికి నూరు శాతం అమలు చేద్దామని జగన్‌ స్పష్టం చేశారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు కమిటీ సభ్యులు 31 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం కమిటీ ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగంలో దాదాపు 70 శాతం వరకు ఉన్న కౌలు రైతులకు అండగా ఉండేందుకు తగిన సహాయం చేసేలా ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో నాలుగు అంశాల ఆధారంగా చర్చ జరిగిందని ఉమ్మారెడ్డి వివరించారు.

‘నవరత్నాలు’లో ప్రకటించిన పథకాలను మరింత మెరుగుపర్చి తీర్చిదిద్దడం, సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో అధ్యక్షులు జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి వచ్చిన అంశాలు, సమస్యలు, ఆయనకు వివిధ వర్గాల నుంచి వచ్చిన అర్జీలు, సభలు, సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు గత నెల 26న విజయవాడలో జరిగిన సమావేశం తర్వాత ప్రజల నుంచి వచ్చిన దాదాపు 300 వినతి పత్రాల్లోని అంశాలను సమావేశంలో చర్చించామన్నారు. అన్నిటినీ క్రోడీకరించి చాలా బ్రీఫ్‌గా పాయింటెడ్‌గా మేనిఫెస్టో రూపొందించనున్నామని ఉమ్మారెడ్డి చెప్పారు. అంతేకాకుండా అవి వందకు వంద శాతం ఒక షెడ్యూల్‌ ప్రకారం అమలు చేయనున్నామని తెలిపారు. అదే విధంగా హామీలు అమలు చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? తదితర అంశాలు పరిశీలించడంతో పాటు అవన్నీ నెరవేర్చేలా ప్రణాళిక రూపొందించాలని పార్టీ అధ్యక్షులు జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారని, ఆ మేరకు అన్నింటినీ సమీక్షిస్తామని వివరించారు.

భూ యజమానులు– కౌలు రైతులకు నష్టం లేకుండా ఫార్ములా
దేశంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడిన రంగం వ్యవసాయం అని, ఇందులో కౌలు రైతులదే ప్రధాన భూమిక అని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, సబ్సిడీ విత్తనాలతో పాటు పరిహారం ఇచ్చే విషయంలో భూ యజమాని, కౌలు రైతు ఇరువురికీ నష్టం కలగకుండా ఒక ఫార్ములా తయారు చేయాలని పార్టీ అధ్యక్షలు జగన్‌ నిర్ధేశించారని తెలిపారు. అందుకే కౌలుదారీ చట్టంలో ఏముంది? అన్నది కూడా సమీక్షించనున్నామన్నారు. ఇంకా ప్రతికూల పరిస్థితుల్లో రైతులను ఎలా ఆదుకోవాలన్న దానిపైనా అన్ని కోణాల్లో చర్చించనున్నట్లు చెప్పారు. సీడ్‌ యాక్ట్, పెస్టిసైడ్‌ యాక్ట్‌ ఇప్పటికే ఉన్నాయని, వాటి మేరకు తప్పు చేసిన వారిని శిక్షించాల్సి ఉంటుందని, వాటిని మేనిఫెస్టో కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు.

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను కూడా పరిశీలించబోతున్నామన్నారు. వీటి ఆధారంగా రైతులకు గిట్టుబాటు ధరల కల్పన, ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి, ధరల స్థిరీకరణ నిధి అన్నింటిపై సమగ్ర డాక్యుమెంటరీ తయారు చేస్తున్నట్లు ఉమ్మారెడ్డి వివరించారు. అదే విధంగా పథకాల అమలుతో ప్రభుత్వంపై పడే భారం తదితర అంశాలను చర్చిస్తామని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తరచూ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, ఆ ప్రక్రియలో భాగంగా ఈ నెల 12న విజయవాడలో భేటీ కానున్నామని ఉమ్మారెడ్డి ప్రకటించారు. ఆ లోపు కూడా ప్రతి రోజూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, ఎవరైనా సూచనలు, వినతి పత్రాలు ఇవ్వొచ్చని సూచించారు. వ్యవసాయం, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బీసీ గర్జన సదస్సులో చేసిన ప్రకటన, ఆ సభలో ఇచ్చిన హామీలను కూడా పరిగణించబోతున్నామన్నారు. 

మరిన్ని వార్తలు