విద్యార్థులే తరిమి కొడతరు

24 Dec, 2017 02:47 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై ఉత్తమ్‌ ఫైర్‌  

లక్ష ఉద్యోగాల భర్తీ ఏమైంది?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవా?  

అధికారంలోకి వస్తే ఖాళీల భర్తీ

రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడి

కాంగ్రెస్‌లోకి పీడీఎస్‌యూ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కోసం చదువులు, జీవితాలు, ప్రాణాలను విద్యార్థులు త్యాగం చేస్తే ఉద్యమ ద్రోహులు భోగాలు అనుభవిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. త్యాగాలు చేసిన విద్యార్థులు, ఉద్యమకారులు, యువకులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిలువునా వంచించారని.. రాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థులే సీఎంను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. శనివారం పీడీఎస్‌యూ విద్యార్థులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే లక్షా 7 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తానన్న కేసీఆర్, నాలుగేళ్లు కావస్తున్నా భర్తీపై కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

ఆడంబరాలు, గడీల నిర్మాణం కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని.. కానీ బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేకుండా పోయాయని దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై అన్ని వర్గాల్లో ఆదరణ పెరుగుతోందని, విద్యార్థుల చేరికే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలను భర్తీ చేస్తామని.. ఉద్యోగాలు దక్కని అర్హులైన నిరుద్యోగులకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.   ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ, హనుమంతరావు, మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి హాజరైన ఈ సమావేశానికి విద్యార్థి నేత మానవతారాయ్‌ అ«ధ్యక్షత వహించారు. విద్యార్థి నేతలు దయాకర్, విద్యాసాగర్‌రెడ్డి, దాసరి శ్రీకాంత్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

సాంస్కృతిక సేన పోస్టరు ఆవిష్కరణ
టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటవనున్న సాంస్కృతిక సేన ధూంధాం దరువు పోస్టర్‌ను ఉత్తమ్‌ ఆవిష్కరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 29న సాంస్కృతిక సేన ఆవిర్భావ సభ నిర్వహిస్తామని.. కవులు, కళాకారులు పాల్గొం టారని ఉత్తమ్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రంలో పరిస్థితులపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.


అఖిలపక్షంతో ఢిల్లీ ఏమైంది..?
వర్గీకరణపై ప్రభుత్వ మోసానికి నిరసన వ్యక్తం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన మహిళా నేత భారతి సంస్మరణ సభ సందర్భంగా ఎమ్మార్పీ ఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అరెస్టు చేసి జైల్లో పెట్టడం దారుణమని ఉత్తమ్‌ విమర్శించారు. మంద కృష్ణను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణపై అసెంబ్లీలో హామీ ఇచ్చిన సీఎం.. అఖిలపక్షంతో ఢిల్లీ ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. వర్గీకరణపై కేసీఆర్‌ వైఖరి స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు