వివరణ.. ఎదురుదాడి

19 Nov, 2023 04:53 IST|Sakshi

రాబోయే 10 రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహం 

ఇప్పటివరకు జరిగిన ప్రచారం తీరుతెన్నులపై సమీక్ష 

అధినేత కేసీఆర్‌ ప్రసంగాలు, విపక్షాల మేనిఫెస్టోల ప్రభావంపై అంచనాలు 

భవిష్యత్తు ప్రచార ప్రణాళికపై ముమ్మర కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు మరో పది రోజులు మాత్రమే ఉండటంతో భారత్‌ రాష్ట్ర సమితి ప్రచార తీరుతెన్నులను లోతుగా సమీక్షిస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గత నెల 15 మొదలుకుని 33 రోజుల వ్యవధిలో 60 నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట జరుగుతున్న ప్రచారంలో కేసీఆర్‌ ప్రసంగ అంశాలు, వాటిపై వస్తున్న ప్రజా స్పందన తదితరాలను పార్టీ అంచనా వేస్తోంది.

తద్వారా రాబోయే పది రోజుల పాటు జరిగే మరో 30కి పైగా సభల్లో ఏ తరహా అంశాలను ఎంచుకోవాలనే కోణంలోనూ కసరత్తు జరుగుతోంది. విపక్ష నేతలు వివిధ సందర్భాల్లో చేస్తున్న విమర్శలు, ప్రకటనలు, ప్రసంగాలను క్రోడీకరిస్తూ, వాటిపై వివరణలు, ఖండనలతో పాటు ఎదురుదాడి చేసేలా వ్యూహరచన జరుగుతోంది. పదేళ్ల పాలనలో తమ ప్రభుత్వ పనితీరును చెప్తూ వస్తున్న కేసీఆర్‌ రాబోయే పది రోజుల్లో ఎదురుదాడి వ్యూహంతో ముందుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రచారం ముమ్మరం 
పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్‌షోలను ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత, వినోద్‌ కుమార్‌ లాంటి నేతలు నిజామాబాద్, కరీంనగర్‌ తదితర చోట్ల మకాం వేసి క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూనే ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు.

పార్టీ అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా రోడ్‌ షో షెడ్యూలుకు అనుగుణంగా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో స్థానిక కేడర్‌ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక పారీ్టలో చేరికల కార్యక్రమాలు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిని దాటుకుని ప్రస్తుతం వార్డులు, గ్రామ స్థాయిలో జరుగుతున్నాయి. 

మేనిఫెస్టోలు, ‘నిఘా’ నివేదికల మదింపు 
విపక్ష పారీ్టలతో పాటు అక్కడక్కడా ఆ పారీ్టల ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానికంగా ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలు, ఓటరుపై వాటి ప్రభావం లాంటి అంశాలను బీఆర్‌ఎస్‌ మదింపు చేస్తోంది.  మేనిఫెస్టోలోని లోపాలు, ఇతర అంశాల ఆధారంగా ఓటరు వద్దకు వెళ్లే వ్యూహంపైనా కసరత్తు జరుగుతోంది. మరోవైపు నిఘా సంస్థల నివేదికలతో పాటు సర్వే సంస్థల రిపోర్టులు, వివిధ మార్గాల్లో అందుతున్న సమాచార క్రోడీకరణ జరుగుతోంది.

తద్వారా ప్రచార లోపాలను సరిదిద్దుకోవడం, పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్న చోట దానిని తటస్థ స్థితి (న్యూట్రలైజేషన్‌)కి తీసుకురావడం, ఇతర దిద్దుబాటు చర్యలపై వార్‌ రూమ్‌లు పనిచేస్తున్నాయి. మరోవైపు ప్రధాన మీడియా, సోషల్‌ మీడియా ద్వారా పార్టీ ప్రచారానికి అవసరమైన కంటెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.   

మరిన్ని వార్తలు