స్థానిక అంశాల వారీగా లోకల్‌ మేనిఫెస్టో

8 Jan, 2020 03:02 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక అంశాల వారీగా లోకల్‌ మేనిఫెస్టో తయారు చేసుకోవాలని జిల్లా, మున్సిపాలిటీల నాయకులకు సూచించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం వరకు సెలక్ట్‌ ఎలక్ట్‌ పద్ధతిలో అభ్యర్థులను నిర్ణయిస్తామని, బుధవారం అన్ని మున్సిపాలిటీల్లో స్థానిక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసేవారు రూ.20 బాండ్‌ పేపరుపై అఫిడవిట్‌ ఇవ్వాలి. పార్టీనుంచి గెలిచిన వారు ఇతర పార్టీలకు వెల్లకుండా అఫిడవిట్‌ ఇవ్వాలి. 11, 12 ఏ, బీ ఫాంలు ఇస్తాం. స్క్రుటినీ తర్వాత బీ ఫాంలు ఇవ్వొచ్చు’ అని ఆయన తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో, నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి.. ఎంపీ అభ్యర్థితో పాటు డీసీసీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాష్ట్ర నాయకులు కలిసి అభ్యర్థులను నిర్ణయిస్తారన్నారు.

మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో టీపీసీసీ తెలంగాణ ఇంచార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీనియర్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, వీహెచ్, మల్లురవి, కుసుమకుమార్, చిన్నారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, మధుయాష్కి, గీతారెడ్డి, శారద, కొండా విశ్వేశ్వరరెడ్డి, బలరాం నాయక్, అంజన్‌ కుమార్‌యాదవ్, జి.నిరంజన్‌ పాల్గొ న్నారు. సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలు, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. కామన్‌ మేనిఫెస్టో తయారు చేయాలని, కాంగ్రెస్‌ గెలిచే మున్సిపాలిటీలపై చర్చించినట్లు ఉత్తమ్‌  మీడియాకు తెలిపారు.

‘పార్టీలో నేను కూడా ఉన్నా. కనీసం పట్టించుకోండి. డీసీసీ నియామకం సమాచారం ఉండదు.. పొత్తుల విషయం చెప్పకుండా మీరే చేస్తారా?’అని రేణుక చౌదరి ప్రశ్నించినట్లు సమాచారం. బుధవారం నుంచి నామినేషన్లుండగా, ఇప్పుడు సమావేశం పెడితే ఎలా? అని ఆమె అన్నారు. ‘మీకు సమాచారం ఇస్తూనే వచ్చాం. మీరే సమావేశాలకు రాలేదు’అని కుంతియా సమాధానమిచ్చినట్లు తెలిసింది. సీనియర్లకు ఒక మున్సిపాలిటీ బాధ్యత ఇవ్వడం అవమానించడం కాదని, వారి అనుభవాలతో గెలవడం కోసమే అని పేర్కొన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు