సీపీఎస్‌ రద్దు చేస్తాం 

9 Nov, 2023 03:05 IST|Sakshi

ఉద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ కీలక హామీ! 

మొత్తం 36 అంశాలతో రెడీ అవుతున్న ప్రజా మేనిఫెస్టో 

కేసీఆర్‌ కిట్‌కు కౌంటర్‌గా వస్తువులు, నగదు సాయం పెంచుతూ మరో పథకం 

ఆటో డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం 

విద్యార్థినులకు స్కూటీల స్థానంలో ల్యాప్‌టాప్‌లు! 

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న కంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని (సీపీఎస్‌) రద్దు చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇవ్వనుంది. దాని స్థానంలో పాత పింఛన్‌ విధానాన్ని (ఓపీఎస్‌)ను పునరుద్ధరిస్తామని చెప్పనుంది. ఈ మేరకు తన ఎన్నికల ప్రణాళికలో చేర్చనుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాల్సిన హామీలతో కూడిన పార్టీ మేనిఫెస్టో కోసం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ దాదాపు గత నెలరోజులుగా కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కమిటీ మొత్తం 36 అంశాలతో మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దినట్టు తెలుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి కూడా గాంధీభవన్‌లో కమిటీ సమావేశమైంది. ఒకట్రెండు అంశాలపై స్పష్టత రాకపోవడంతో పార్టీ పెద్దలను సంప్రదించిన తర్వాత ఆ అంశాలను పొందుపరిచి నాలుగైదు రోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి.  

కొత్త స్కీములు..కౌంటర్‌ పథకాలు 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతి ఏటా ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామని, ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ కేలండర్‌ను విడుదల చేయడంతో పాటు ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇవ్వనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాన్ని 25 శాతం పెంచుతామనే హామీని కూడా మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారు.

బాలింతలకు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్‌ కిట్‌కు కౌంటర్‌గా మరో పథకాన్ని ప్రకటిస్తారని, కిట్‌లోని వస్తువులతో పాటు ఆర్థిక సాయం పెంచుతారని సమాచారం. అదే విధంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం పథకాన్ని కూడా ప్రకటించనున్నారు. చదువుకుంటున్న విద్యార్థినులందరికీ స్కూటీలు ఇస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, తాజాగా వాటి స్థానంలో ల్యాప్‌టాప్‌లిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

అందరి సంక్షేమమే లక్ష్యం..! 
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజా మేనిఫెస్టో పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమ, అమరవీరుల సంక్షేమ, వ్యవసాయం–రైతు సంక్షేమం, నీటి పారుదల, యువత–ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగాలు, గృహ నిర్మాణం, భూపరిపాలన, పౌరసరఫరాలు, ని త్యావసరాల పంపిణీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్‌ రంగం, టీఎస్‌ఆర్టీసీ సంక్షేమం, మద్య విధానం, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, సింగరేణి కార్మికులు, కార్మికులు, న్యాయవాదులు, సీనియర్‌ సిటిజన్లు, జర్నలిస్టులు, గల్ఫ్‌ ఎన్నారైలు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, క్రీడారంగం, పోలీస్‌–శాంతి భద్రతల వ్యవస్థ, పర్యాటక రంగం, జానపద, సినిమా–సాంస్కృతిక రంగం, ధార్మిక రంగం, పర్యావరణం, గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ నేతలు రూపకల్పన చేస్తుండడం గమనార్హం. 

మరిన్ని వార్తలు