కాంగ్రెస్‌కు వ్యతిరేకమనే.... ఎన్టీఆర్‌ నన్ను ఓడించలేదు

24 Aug, 2018 08:29 IST|Sakshi

 ఉపరాష్ట్రపతిగా అప్పుడే ఏడాది పూర్తయిందా అని అనిపిస్తోంది

రాజ్యసభ నిర్వహణే నా ముందున్న పెద్ద సవాల్‌

సభ జరుగుతున్న తీరుతో సంఘర్షణకు లోనవుతున్నా

ఆత్మీయుల సమావేశంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాననే ఒకే ఒక్క కారణంతో 1983 నాటి ఎన్నికల్లో తాను ఓడిపోకూడదని నాటి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు కోరుకున్నారని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. తాను పోటీచేస్తున్న నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ ప్రచారానికి రావాల్సి ఉన్న సమయంలో ఈ విషయం చెప్పడానికి స్వయంగా దగ్గుబాటి చెంచురామయ్యను తన దగ్గరకు పంపారని.. ఆ ఎన్నికల్లో తాను గెలిచానని ఆయన గుర్తుచేశారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం విజయవాడలోని ఒక ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఆత్మీయుల సమావేశంలో ప్రసంగించారు. తన స్నేహితుల కారణంగానే తాను ఈ స్థాయికి ఎదిగానని వెంకయ్యనాయుడు చెప్పారు.

అదే అతిపెద్ద సవాల్‌...
రాజకీయంగా నిత్యం బిజీగా ఉండే తాను.. స్వేచ్ఛగా మాట్లాడాలన్నా, కోరుకున్న చోటుకి వెళ్లాలన్నా అనేక ప్రోటోకాల్‌ ఆంక్షలు ఉండే ఐదేళ్ల ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఎప్పుడు పూర్తవుతుందోనని మొదట్లో అనుకున్నానని.. కానీ, అప్పుడే ఓ ఏడాది పూర్తయిందా అని అనిపిస్తోందన్నారు. ఉప రాష్ట్రపతిగా రాజ్యసభ నిర్వహణే ఇప్పుడు తన ముందున్న పెద్ద సవాల్‌ అని వ్యాఖ్యానించారు. చైర్మన్‌గా రాజ్యసభ స్థాయిని పెంచాలన్న లక్ష్యం.. సభ జరుగుతున్న తీరు మధ్య తాను సంఘర్షణకు లోనవుతున్నట్టు చెప్పారు. చట్టసభలు సజావుగా జరగడానికి రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ ప్రారంభోత్స కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదన్న ప్రచారంలో వాస్తవంలేదని, అధికారులు పిలిచినా సీఎంకు సమయం కుదరకపోవడంవల్లే కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలిసిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు