సిటీ పోలీస్‌.. రోల్‌మోడల్‌!

24 Aug, 2018 08:27 IST|Sakshi
బెంగళూరు పోలీసుల నోటీసు ఫొటో

బెంగళూరుకు ఆదర్శంగా నగర పోలీసువింగ్‌

అక్కడా ప్రజాభద్రత చట్టం అమలుకు కసరత్తు

వాణిజ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి నిర్ణయం

ఇక్కడి చర్యలు అధ్యయనం చేసి వెళ్లిన అధికారులు

అక్కడి వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్న వైనం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగర పోలీసు విభాగాన్ని కర్ణాటక అధికారులు రోల్‌మోడల్‌గా తీసుకున్నారు. ఇక్కడ అమల్లోకి తీసుకువచ్చిన ప్రజాభద్రతా చట్టాన్ని ఎలా అమలు చేశారనేది అధ్యయనం చేశారు. దీని ప్రకారం సిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లే బెంగళూరులోనూ చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు, అనుసంధానం, వచ్చిన ఫలితాలపై నగర పోలీసు విభాగం నుంచి సమగ్ర నివేదిక సేకరించిన అక్కడి పోలీసులు ఈ నెల రెండో వారం నుంచి అమలు చేయడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ఠాణాల్లోని ఎస్సైలు తమ పరిధిలో ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాలకు నోటీసులు జారీ చేశారు. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలతో పాటు గుజరాత్‌లోని సూరత్‌కు దీటుగా హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంకా చేస్తున్నారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో  కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కెమెరాలతో కలిసి ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో 2.5 లక్షల వరకు అందుబాటులోకి వచ్చాయి. సిటీలోనే దాదాపు 2 లక్షల వరకు ఉన్నాయి. వీటన్నింటినీ ఆయా కమిషనరేట్లలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్స్‌కు (సీసీసీ) అనుసంధానం చేశారు.

దీనికి కారణం.. 2014లో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ప్రజాభద్రతా చట్టమే. దీన్ని కమిషనరేట్ల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని కచ్చితం చేశారు. పోలీసుస్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కమిషనర్లు... ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరివారు ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినవారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి. గడచిన మూడేళ్లలో ఈ కెమెరాల కారణంగానే సిటీలో అనేక కేసులు కొలిక్కి వచ్చాయి. గత ఏడాది దాదాపు 3600 కేసుల్లో సీసీ కెమెరాలే కీలక ఆధారాలు అందించాయి. ఈ అంశాలను నిశితంగా గమనించిన కర్ణాటక పోలీసులు అధ్యయనం చేశారు. 

అమలు ఇలా..
తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రజా భద్రతా చట్టం ప్రతిని సేకరించడంతో పాటు ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని హైదరాబాద్‌కు పంపారు. సీసీ కెమెరాల ఫలితాలను విశ్లేషించిన తర్వాత అక్కడా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో గతేడాది కర్ణాటక పబ్లిక్‌ సేఫ్టీ (మెషర్స్‌) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్ట్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ప్రాథమింంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కర్ణాటక డీజీపీ ఇచ్చిన ఆదేశాలతో ఈ నెల్లో బెంగళూరు పోలీసుల కదిలారు. తమ పరిధిలోని వ్యాపార, వాణిజ్య, విద్యా, ఆధ్యాత్మిక సంస్థలతో పాటు అపార్ట్‌మెంట్స్, హాస్పిటల్స్‌కు స్థానిక ఎస్సైలు ఈ నెల 12న నోటీసులు జారీ చేశారు. పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యమంటూ అందులో స్పష్టం చేశారు. ఈ నోటీసులు అందుకున్న 15 రోజుల్లో సీసీ కెమెరాల ఏర్పాటును చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కోణంలో విఫలమైతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడంలో సిటీ పోలీసులు తీసుకున్న చర్యలను పరిశీలిస్తున్న బెంగళూరు అధికారులు అక్కడా ఇవే అమలు చేయాలని యోచిస్తున్నారు.

ప్రజల స్పందన బాగుంది..  
నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ప్రజల సహకారం మరువలేనిది. కేవలం వ్యాపార, వాణిజ్య వర్గాలే కాకుండా కాలనీలతో పాటు సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఎవరికి వారు తమ బాధ్యతగా భావించి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా ఎక్కడిక్కడ మినీ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతల్లో ప్రజల్నీ భాగస్వాముల్ని చేయనున్నాం.
– నగర పోలీసు ఉన్నతాధికారి

మరిన్ని వార్తలు