15 అసెంబ్లీ సీట్లు ఇస్తే.. మీరేం చేశారు?

10 Oct, 2018 14:10 IST|Sakshi

సాక్షి, ఏలూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో దాదాపు రూ. 5 లక్షల కోట్లను విదేశాలకు తరలించారని ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన విజయసాయిరెడ్డి.. చంద‍్రబాబు పాలన అంతా అవినీతి మయంగా తయారైందన్నారు. ప్రధానంగా పశ్చిమలో 15 అసెంబ్లీ సీట్లను ప్రజలు ఇస్తే.. అసలు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని సీట్లు ఇస్తే రౌడీ ఇజాన్ని, ఇసుకదందాని టీడీపీ ఎమ్మెల్యేలతో చేయిస్తున్నారన్నారు. ద్వారకాతిరుమల వెంకన్నసాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేసి పశ్చిమకు ఎంత న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొల్లేరు విషయంలో స్వార్థ ప్రయోజనాలే తప్ప ప్రజల కోసం మాత్రం ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. 

‘పశ్చిమలో 15 అసెంబ్లీ సీట్లు ఇస్తే మీరు జిల్లాకి ఏం చేశారు. అన్ని సీట్లు ఇస్తే రౌడీయిజాన్ని, ఇసుక దందాని మీ ఎమ్మెల్యేలతో చేయిస్తున్నారు. 2014లో డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సన్మానం చేయించుకున్నారు. కానీ వారికి రుణమాఫి మాత్రం చేయలేకపోయారు. నాలుగున్నరేళ్ళల్లో సుమారు రూ. 5 లక్షల కోట్లు విదేశాలకి తరలించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు విదేశాలలో దాచుకున్న అక్రమార్జనను వెనక్కి రప్పిస్తాం. ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన తనయుడు విదేశాలకు పారిపోకుండా వారి పాస్ పోర్ట్ లు సీజ్ చెయ్యాలి. రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్. దానికి సహకరించిది టీడీపీ. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలయిక అనైతికం. ఐటి సోదాలంటే చంద్రబాబు భయపడుతున్నారు. తప్పు చేయకపోతే ఐటి సోదాల సమయంలో పోలిసులను పంపకూడదని క్యాబినెట్‌లో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగున్నరేళ్ళు కేంద్రంతో జతకట్టి ఇపుడు సహకరించడంలేదంటూ చంద్రబాబు లేఖ రాస్తాననడం హస్యాస్పదం’ అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని అధికారంలోకి రాగానే సుపరిపాలనే అందించాలనేది తమ పార్టీ ఉద్దేశమన్నారు. తండ్రికి మించిన తనయుడిగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనేదే జగన్‌ ఆశయమన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. టీడీపీ అనుసరిస్తున‍్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, వారు పడుతున్న ఇబ్బందులను జగన్‌ దృష్టికి నేరుగా తీసుకువస్తున్నారని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అధికార టీడీపీలో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయిందన్నారు. 

మరిన్ని వార్తలు